పెళ్లి చేసుకునేందుకు ఆడపిల్లలు కరువౌతున్న ఈ రోజుల్లో.. తమ ఇంట్లోకి అడుగుపెట్టిన కోడల్ని.. కట్టుకున్నవాడు, అత్త, మామ, ఆడపడుచులు.. మరింత కట్నం తీసుకురావాలంటూ ఆరళ్లకు గురి చేస్తున్నారు. తాజాగా ఓ వివాహిత ఈ వేధింపుల కారణంగా బలవన్మరణానికి పాల్పడింది.
ఆకాశంలో సగం.. అయినా మహిళలకు తప్పని వేధింపులు. సాంకేతిక పరంగా భారత్ దూసుకుపోతున్నా.. వరకట్నమనే ఆచారం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీని కారణంగా అనేక మంది అతివలు ప్రాణాలు కోల్పోతున్నారు. పెళ్లి చేసుకునేందుకు ఆడపిల్లలు కరువౌతున్న రోజుల్లో.. తమ ఇంట్లోకి అడుగుపెట్టిన కోడల్ని.. కట్టుకున్నవాడు, అత్త, మామ, ఆడపడుచులు.. మరింత కట్నం తీసుకురావాలంటూ ఆరళ్లకు గురి చేస్తున్నారు. వీటిని తట్టుకోలేని కోడలు.. అర్థంతరంగా తనువు చాలిస్తున్నారు. పిల్లలను అనాధలను చేస్తున్నారు. తాజాగా ఓ వివాహిత కట్న వేధింపులకు బలౌంది. ఈ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామవరం ప్రాంతానికి చెందిన దిబ్బ మధుకి.. అదే ప్రాంతానికి చెందిన రవళి (26)తో మూడేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఓ కుమార్తె అరణ్య ఉంది. మధు సింగరేణిలో ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే చాలీచాలని జీతంతో బతుకున్న ఈ కుటుంబాన్ని ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. అయితే సమస్యల నుండి గట్టెక్కాలంటే పుట్టింటి నుండి అదనపు కట్నం తీసుకురావాలంటూ మధు..రవళిపై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించాడు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య కొద్దినెలలుగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం కూడా ఇద్దరి మధ్య ఘర్షణ నెలకొంది.ఈ గొడవలో రవళిపై మధు చేయిచేసుకున్నాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆమె.. అందరూ నిద్రించే సమయంలో ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
తెల్లారే సరికి ఆమె మృతదేహం వేలాడుతోంది. తల్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిందని తెలియని రెండేళ్ల అరణ్య పాల కోసం గుక్కపెట్టి ఏడ్చింది. అమ్మా అమ్మా అని పిలుపు..అక్కడ అరణ్య రోదనే అయ్యింది. విగత జీవిగా పడి ఉన్న తల్లి కోసం ఆమె ఏడ్చిన తీరు అక్కడి వారందరినీ కంటతడి పెట్టింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. జిల్లా సర్వజన ఆసుపత్రి శవాల గదిలో భద్రపరిచిన రవళి మృతదేహాన్ని డీఎస్పీ రెహమాన్ సందర్శించారు. శరీరంపై ఏమైనా గాయాలున్నాయా? అనే కోణంలో పరిశీలించారు. మృతురాలి తల్లిదండ్రులు, ఇన్వెస్టిగేషన్ ఎస్సై జుబేదాతో మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు. మధును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.