తెలంగాణ, ఏపీల్లో పదో తరగతి పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. విద్యార్థుల వెంట తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాలకు వచ్చారు. దీంతో అక్కడ సందడి వాతావరణం కనిపించింది. కానీ ఈ పరీక్ష వేళ ఓ విద్యార్థి ఇంట పెను విషాదం నెలకొంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలి పరీక్ష కావడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంతో అక్కడ హడావుడి కనిపించింది. ఏపీలో నిమిషం నిబంధన అమల్లో ఉండగా.. తెలంగాణ ఐదు నిమిషాల వరకు పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించారు. తెలంగాణలో 4.84 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అయితే ఇక్కడ ప్రశ్నా పత్రాల లీకేజీ కలకలం సృష్టించింది. దీనిపై అధికారులు చర్యలు కూడా తీసుకున్నారు. ఈ పరీక్షల వేళ ఓ విద్యార్థి ఇంట్లో పెను విషాదం నెలకొంది. అయితే ఈ విషయం అతడికి తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డారు. పరీక్ష రాసి వచ్చిన విద్యార్థికి విషయం చెప్పగా కన్నీటి పర్యంతమయ్యాడు.
వివరాల్లోకి వెళితే..ఎక్కిరాల దేవమణి, భర్త రాంబాబు దంపతులు ఖమ్మంలో నివసిస్తున్నారు. దేవమణి కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తుంది. అయితే భార్య భర్తల మధ్య తరచూ తగాదాలు జరుగుతున్నాయి. దీంతో కుమారుడు ప్రణవ్ తేజ్‌ను ఓ ప్రైవేట్ స్కూల్‌లో చేర్పించి చదివిస్తున్నారు. ప్రణవ్ అక్కడి హాస్టల్‌ల్లో చదువుకుంటూ.. పది పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. ఆదివారం రాత్రి కూడా దేవమణి, రాంబాబు మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో దేవమణిని రాంబాబు రోకలిబండతో గట్టిగా కొట్టడంతో చనిపోయింది. తెల్లారితే సోమవారం నుండి ప్రణవ్‌కు పదో తరగతి పరీక్షలు ప్రారంభమౌతుండగా ఈ విషాదం నెలకొంది.
హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్న ప్రణవ్‌కు తల్లి చనిపోయిందన్న విషయం తెలిస్తే పదో తరగతి తొలిరోజు పరీక్షకు హాజరు కాలేడని భావించిన బంధువులు, ఉపాధ్యాయులు మిన్నకుండిపోయారు. పరీక్ష పూర్తి అయ్యాక నేరుగా మార్చురీ వద్దకు తీసుకెళ్లి తల్లి మృతదేహాన్ని చూపించడంతో ఒక్కసారిగా ఖిన్నుడయ్యాడు. అనంతరం తల్లి మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరు అయ్యాడు. అంతకు కొద్దిక్షణాల ముందే పరీక్ష బాగా రాశానని తనకెదురైన తన తల్లి స్నేహితురాలికి నవ్వుతూ ప్రణవ్ బదులివ్వడాన్ని చూసి బంధువులు కంటతడి పెట్టారు. పోలీసులు ఈ విషయంపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.