తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ వ్యవహారం మర్చిపోకముందే.. పదవ తరగతి ఎగ్జామ్ పేపర్లు వరుసగా లీక్ కావడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. వికారాబాద్ జిల్లాలో తాండూర్ తెలుగు పేపర్ లీక్ కాగా.. వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ లీక్ కావడంతో పెద్ద దుమారం చెలరేగింది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు మొదలైనప్పటి నుంచి పేపర్ లీకేజీ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. మొదటి రోజు తెలుగు క్వశ్చన్ పేపర్ వికారాబాద్ జిల్లా తాండూర్ లో లీక్ అయ్యింది.. రెండవరోజు వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ లీక్ అయ్యింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం.. పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్ అనుమతి లేదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తాజాగా రాచకొండ సీపీ చౌహాన్ ఎల్బీ నగర్ పరిధిలో పరీక్షా కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో ఓ ఘటన చోటు చేసుకుంది. సెల్ ఫోన్ తో చౌహాన్ లోపలికి వెళ్తున్న సమయంలో గేటు వద్ద ఓ మహిళా కానిస్టేబుల్ ఆయనకు అడ్డు చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో వరుసగా టెన్త్ పరీక్షా పేపర్లు లీక్ కావడంతో ప్రభుత్వంపై అటు ప్రతిపక్షాలు.. ఇటు ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఇక నుంచి పరీక్షా కేంద్రాల వద్ద ఎవరికీ సెల్ ఫోన్ అనుమతి లేదని ఆదేశాలు జారి చేసింది. అంతేకాదు తెలంగాణ వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న 2,652 కేంద్రాల్లో సిట్టింగ్ స్క్యాడ్స్ ని నియమించడంతో పాటు.. పరీక్షలు జరిగే సమయంలో పోలీస్, పంచాయతీరాజ్, రెవెన్యూ సిబ్బంది పూర్తి స్థాయిలో పర్యవేక్షణకు వినియోగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఉదయం రాజకొండ సీపీ చౌహాన్ ఎల్బీ నగర్ పరిధిలో పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఇక ఎల్ బీ నగర్ గవర్నమెంట్ స్కూల్ లో ఏర్పాటు చేసిన పదవతరగతి పరీక్షా కేంద్రానికి ఆయన వెళ్లారు.. గేటు బయట ఉన్న అధికారులకు అలర్ట్ గా ఉండాలని సూచించారు. అలాగే పరీక్షా ఏర్పాట్లపై సూచనలు ఇచ్చారు.
సీపీ చౌహన్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించేందుకు లోపలికి వెళ్తున్న సమయంలో.. గేటు వద్ద ఉన్న మహిళా కానిస్టేబుల్ ఆయన్ని అడ్డుకొని.. ‘సార్ లోపలికి సెల్ ఫోన్ అనుమతి లేదు’ అని అనడంతో అక్కడ ఉన్న అధికారులు షాక్ అయ్యారు. వెంటనే సీపీ తన సెల్ ఫోన్ ని మహిళా కానిస్టేబుల్ చేతిలో పెట్టి పరీక్షా కేంద్రం లోపలికి వెళ్లారు. ఆయన వెంట వెళ్లిన మిగతా అధికారులు సైతం తమ సెల్ ఫోన్ బయట ఉంచి వెళ్లారు. సాధారణంగా విధి నిర్వహణలో ఉన్నతాధికారులు అకస్మాత్తుగా తనిఖీకి వస్తే.. అక్కడ ఉద్యోగులు ఆందోళనకు గురైతారు.. కొన్నిసార్లు బాస్ లు ఏమరపాటుగా తప్పులు చేసినా అది తప్పు అని చెప్పే సాహసం ఎవరూ చేయరు. అలాంటిది పోలీస్ కమిషనర్ నే అడ్డుకొని నిబంధనలు గుర్తుచేసిన ఆ మహిళా కానిస్టేబుల్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటకు వచ్చిన సీపీ చౌహాన్.. విధి నిర్వహణలో మహిళా కానిస్టేబుల్ చూపించిన అంకితభావం, ధైర్యసాహసాలను మెచ్చుకొని ఆమెకు రివార్డు ప్రకటించారు.