ఆడపిల్ల పుట్టిందనగానే గుండెలపై భారం పడిందని భావించే కాలం పోయింది. ఆడ, మగ ఎవరు పుడితే ఏంటీలే.. ఇద్దరూ సమానమేనని తల్లిదండ్రులు భావిస్తున్నారు. చదివించడం దగ్గర నుండి ఆస్తి పంపకాలు వరకు అన్నింటా ఆడ,మగ అనే వ్యత్యాసం కనబర్చడం లేదు. నాగరికత, అక్షరాస్యతకు ఆమడ దూరంలో ఉన్న ప్రాంతాలు తప్ప.. మిగిలిన వారంతా మగ పిల్ల వాని కంటే ఆడ పిల్లకే మొగ్గు చూపుతున్నారు. పిల్లలు కలగని వారి సైతం.. దత్తత విషయంలో ఆడపిల్లకే ఓటు వేస్తున్నారట. తెలంగాణాలో ఇదే ఇప్పుడు ట్రెండ్. గతంలో మగ పిల్లలు కావాలని కోరగా, ఇప్పుడు ఆడ బిడ్డల్నే దత్తతకు కోరుతున్నారట.
తెలంగాణలో రోజు రోజుకూ ఆడ పిల్లలను దత్తత తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దత్తతకు పాపే కావాలని దంపతులు కోరుతున్నట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. దత్తత తీసుకునే వారిలో హైదరాబాద్ వాసులు అధికంగా ఉన్నారట. దరఖాస్తులు పూర్తి చేసే సమయంలో ఆడ బిడ్డలకే దంపతులు ఓటు వేస్తున్నారట. ఈ ఎనిమిదేళ్ల కాలంలో 1,430 మంది పిల్లలను దత్తత తీసుకోగా.. అందులో వెయ్యి మందికి పైగా ఆడ పిల్లలే ఉన్నారు. 1,069 మంది ఆడ పిల్లలను దత్తత తీసుకోగా, 361 మంది అబ్బాయిలు మాత్రమే దత్తతకు వెళ్లారని తెలిపారు.
ఆడ పిల్ల కావాలని దత్తత దరఖాస్తులో కోరితే.. ఏడాదిలోనే దత్తత కార్యక్రమం పూర్తి చేసి ఇంటికి తీసుకు వెళ్లవచ్చని తెలిపారు. అదే అబ్బాయే కావాలని కోరితే మాత్రం కనీసం మూడేళ్ల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. 95 శాతానికి పైగా ఆడ పిల్లలను దత్తత తీసుకుంటారని చెప్పారు. ఆడ పిల్లలను దత్తత తీసుకోవడానికి ప్రధాన కారణం వెయిటింగ్ టైమ్ తక్కువగా ఉండటమేనని తెలిపారు. ఆడ పిల్లలు పుడితే.. గుదిబండలా చూసే నాటి నుండి పాపే దత్తతకు కావాలని కోరడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంతో తెలియజేయండి.