హైదరాబాద్ లో వర్షాలు పడితే ప్రాణాలు పోతాయేమో అని జనాలు భయపడే పరిస్థితి నెలకొంది. గట్టిగా వాన పడితే హైదరాబాద్ రోడ్లన్నీ మునిగిపోతున్నాయి. వరద నీరు పోవాలని నాలాలు మూతలు తెరిచి పెడుతుండడంతో.. ఓపెన్ లో ఉందని తెలియక జనాలు అందులో పడి ప్రాణాలు కోల్పోతున్నారు. మౌనిక అనే బాలిక పాల ప్యాకెట్ కోసమని దుకాణానికి వెళ్తుండగా నాలాలో పడి కొట్టుకుపోయింది. ఈ సంఘటన మరువక ముందే మరొక విషాదం నెలకొంది. భారీ వర్షం కారణంగా కానిస్టేబుల్ మృతి చెందారు.
హైదరాబాద్ లో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. రోడ్లపై మోకాళ్ళ లోటు వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పార్క్ చేసి ఉన్న వాహనాలపై చెట్లు విరిగిపడ్డాయి. దీంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రోడ్లు జలమయమవ్వడంతో ఎక్కడ మ్యాన్ హొల్స్ తెరిచి ఉన్నాయో, ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్, జగద్గిరిగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, దిల్ సుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
దీంతో అత్యవసర సమయంలో తప్పితే ప్రజలు బయటకు రాకూడదని జీహెచ్ఎంసీ సూచించింది. అధికార యంత్రాంగం, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద విద్యుత్ తీగ తెగిపడడంతో కానిస్టేబుల్ వీరాస్వామి మృతి చెందారు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కారణంగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ప్రాంతంలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఆ సమయంలో అటు వైపు బైక్ పై గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ వీరాస్వామి (40) వెళ్తున్నారు. విద్యుత్ షాక్ తగలడంతో అక్కడిక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోలెం వీరాస్వామి.. హైదరాబాద్ నగర శివారులోని గండిపేటలో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు.
ఆదివారం రాత్రి 9:40 గంటల సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1 నుంచి ఎన్టీఆర్ భవన్ వైపు వస్తుండగా భారీ ఈదురుగాలులు, వర్షం కారణంగా బైక్ అదుపు తప్పింది. దీంతో వీరాస్వామి ఫుట్ పాత్ మీద పడడంతో అక్కడే ఉన్న కరెంట్ స్తంభం వద్ద తీగలు తగిలి మృతి చెందారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పెట్రోలింగ్ పోలీసులు కానిస్టేబుల్ వీరాస్వామిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వీరాస్వామి స్వస్థలం మహబూబాబాద్ జిల్లా గంగారం అని.. యూసఫ్ గూడ బెటాలియన్ లో మిత్రుడ్ని కలిసి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.
జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద విద్యుత్ షాక్ తో గ్రే హాండ్స్ కానిస్టేబుల్ మృతి.. బలమైన ఈదరుగాలులతో వర్షం..అదుపు తప్పిన బైక్.. ఫుట్ పాత్ మీద పడడంతో అక్కడే ఉన్న కరెంట్ స్తంభం వద్ద షాక్ తగిలి కానిస్టేబుల్ వీరా స్వామి మృతి.@shojubileehills Limits pic.twitter.com/dFKRCYBXpK
— Minhaj Hussain Syeed (@MinhajHussains) April 30, 2023