కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయనను హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, కార్యకర్తలు ప్రార్థిస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మంత్రి కుందూరు జానారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా, మంగళవారం జానారెడ్డి హైదరాబాద్ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లారు. మోకాలి చికిత్స కోసం ఆయన డాక్టర్లను కలిశారు. ఈ నేపథ్యంలో వైద్యులు జానారెడ్డికి అన్ని పరీక్షలు నిర్వహించారు. ఆయనకు అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. గుండె రక్తనాళాల్లో ఒకటి పూర్తిగా పూడుకు పోయిందని గుర్తించారు. ఇదే విషయం జానారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు వివరించారు.
వారి అనుమతితో మంగళవారం రాత్రి స్టెంట్ వేశారు. ప్రస్తుతం జానారెడ్డి పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ముందుగానే గుండె సమస్య గుర్తించడం వల్ల ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు. జానారెడ్డి అస్వస్థతకు గురయ్యారనే వార్త తెలిసి ఆయన అభిమానులు , కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. జానారెడ్డి త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, కార్యకర్తలు ప్రార్థిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన తరువాత ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో హోం మంత్రిగా పని చేశారు. నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానం నుంచి పలు దఫాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల్లో జానారెడ్డి ఒకరు. తనదైన రాజకీయంతో ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.