బిర్యానీ అంటే హైదరాబాదే పెట్టిందీ పేరు. ఇప్పుడు ఈ హైదరాబాద్ బిర్యానీ అన్ని చోట్ల దొరుకుతుంది. పట్టణాల నుండి పల్లెటూర్లకు పాకింది. ఇప్పుడు ఈ బిర్యానీలో వివిధ ఫ్లేవర్లు వచ్చాయి. అదే సమయంలో కొన్ని రెస్టారెంట్లు.. అపరిశుభ్రమైన ఆహారాన్ని అందిస్తున్నాయి.
బిర్యానీ ఇష్టపడని వారుండరు. ఆ పేరు చెబితేనే నోరూరిపోతుంది. ఇక వేడి వేడి బిర్యానీని వడ్డించుకు తింటుంటే.. ప్లేటు ఖాళీ కావాల్సిందే. అయితే ఒకప్పుడు బిర్యానీ అంటే హైదరాబాదే పెట్టిందీ పేరు. ఇప్పుడు ఈ హైదరాబాద్ బిర్యానీ అన్ని చోట్ల దొరుకుతుంది. పట్టణాల నుండి పల్లెటూర్లకు పాకింది. ఇప్పుడు ఈ బిర్యానీలో వివిధ ఫ్లేవర్లు వచ్చాయి. బావర్చీ బిర్యానీ, కుండ బిర్యానీ, ధమ్ బిర్యానీ, బొంగు బిర్యానీ అంటూ వివిధ రకాలుగా వండి వడ్డిస్తున్నాయి హోటల్స్. ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ లభించేస్తోంది. తినడమే పనిలో భాగంగా అందులో ఏమీ ఉందా.. ఎలా చేస్తున్నారా అని పట్టించుకోవడం లేదు జనాలు. మొన్నటికి మొన్న ఓ రెస్టారెంట్ హోటల్ బాత్రూములో కడిగిన వీడియో ఎంత వైరల్‌గా మారిందో అందరికీ తెలుసు. అయితే ఇటువంటిదే గతంలో ఓ ఘటన చూడగా.. ఇప్పుడు తీర్పు వచ్చింది.
అమీర్‌పేట్‌లోని ఓ రెస్టారెంట్ నుండి బిర్యానీ ఆర్డర్ పెట్టిన కస్టమర్.. తిందామని పార్శిల్ ఓపెన్ చేస్తే ఖంగుతినడం అతని వంతైంది. ఎందుకంటే అందులో బొద్దింక వచ్చింది. దీంతో ఆ రెస్టారెంట్‌పై వినియోగదారుడు వివాదాల పరిష్కార కమిషన్‌కు వెళ్లగా.. రెస్టారెంట్‌కు జరిమానా పడింది. వివరాల్లోకి వెళితే. . 2021లో అమీర్‌పేట్‌లోని రెస్టారెంట్ నుండి రూ. 240 విలువ చేసే చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాడు. ఎం అరుణ్ కుమార్ అనే వ్యక్తి. ఆర్డర్ వచ్చాక బిర్యానీ తినేందుకు పార్శిల్ ఓపెన్ చేయగా.. అందులో బొద్దింక కనిపించింది. బిర్యానీలో బొద్దింకను ఫొటోలు, వీడియోలు తీసి రెస్టారెంట్‌కు వెళ్లి చూపించాడు. అయితే దాని యజమాని సమాధానం విని కస్టమర్ షాక్ తిన్నాడు.
మీ ప్రాంతాల్లో కీటకాలు ఎక్కువని, అక్కడి బొద్దింకే అందులో పడి ఉంటుందని చెప్పాడు. ఆగ్రహం వ్యక్తం చేసిన అరుణ్.. తన డబ్బులు తనకు తిరిగి ఇచ్చేయాలని కోరాడు. కానీ రెస్టారెంట్ ఇవ్వలేదు. దీంతో అరుణ్ ఈ విషయంపై జిల్లా వినియోగదారుల ఫోరమ్ ను ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన ఫోరమ్.. రెస్టారెంట్ తన వినియోగదారులకు పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పేర్కొంది. వినియోదారుడికి పరిహారంగా రూ.20,000 చెల్లించాలని ఏప్రిల్ 18న జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తీర్పు నిచ్చింది. 45 రోజుల వ్యవధిలో జరిమానా చెల్లించాలని కమిషన్ ఆదేశించండతో పాటు చేసిన ఖర్చుల కోసం రెస్టారెంట్‌పై అదనంగా రూ.10,000 చెల్లించాలని స్పష్టం చేసింది.