భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈరోజు హైదరాబాదుకు విచ్చేశారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ప్రోటోకాల్ ప్రకారం తొలుత గవర్నర్ తమిళిసై రాష్ట్రపతికి స్వాగతం పలుకగా, తర్వాత సీఎం కేసీఆర్ శాలువా కప్పి సాదరంగా స్వాగతం పలికారు. కేసీఆర్ వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. స్వాగతం పలికిన తర్వాత రాష్ట్రపతికి అందరినీ పేరుపేరునా పరిచయం చేశారు. ముచ్చింతల్ లో నిర్వహిస్తున్న రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలకు ఆయన హాజరుకానున్నారు.
ఇప్పటికే ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఏపీ సీఎం జగన్ లతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రామ్ నాథ్ కోవింద్ ముచ్చింతల్ కు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన 120 కిలోల రామానుజాచార్యుల బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
ఇది చదవండి: IPL వేలం: అందరి టేబుల్స్‌పై ఒక రకం.. నీతా అంబానీ టేబుల్‌పై స్పెషల్!
రాష్ట్రపతి భద్రతా, ట్రాఫిక్ కారణాల దృష్ట్యా ఆదివారం మ.1 గంట నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ముచ్చింతల్ శ్రీ రామానుజ జీయర్ ఆశ్రమం వైపు ఎవరూ వెళ్లొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో రాకపోకలు సాగించేవారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అన్నారు. అనంతరం రాజ్ భవన్ కు చేరుకుంటారు. ఈ రాత్రికి ఆయన రాజ్ భవన్ లోనే బస చేస్తారు. రేపు ఉదయం 10 గంటలకు ఆయన తిరిగి ఢిల్లీకి బయల్దేరుతారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.