గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాల ప్రభావం అధికంగా ఉంది. మరీ ముఖ్యంగా గోదావరి తీర ప్రాంత ప్రజలు భారీ వరదలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఖమ్మంలో భారీ వరదల మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో గోదావరి నది వరద ముంపు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుని తగిన సహాయ కార్యక్రమాలు అందించేలా అధికారులను ఆదేశిస్తున్నారు. ఇక ఆదివారం ఉదయం భద్రాచలం పర్యటనకు బయలుదేరారు. వర్షాలు కురుస్తుండటంతో, వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ లో ఏరియల్ సర్వేను అధికారులు రద్దు చేశారు. దీంతో బాధిత ప్రజలకు చేరుకునేందుకు రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారు సీఎం. ములుగు, ఏటూరునాగారం మీదుగా వరద పరిస్థితులను వీక్షిస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారీ వర్షాల వెనక విదేశాల కుట్ర కోణం దాగుందని తెలిపారు. ఇతర దేశాల వాళ్లు భారత్‌పై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దీనిలో భాగంగా క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్దతిని వాడుకుంటున్నారని చెప్పుకొచ్చారు. గతంలో లేహ్‌లో క్లౌడ్ బరస్ట్ చేశారు.. తాజాగా ఉత్తరాఖండ్‌లో కూడా ఇలానే క్లౌడ్ బరస్ట్ చేశారని వెల్లడించారు. ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా ఇదే పద్దతిలో కుట్రలు చేస్తున్నారని సమాచారం వచ్చింది అన్నారు కేసీఆర్.
క్లౌడ్ బరస్ట్ అంటే..
ఒక ప్రాంతంలో ఆకస్మికంగా భారీ వర్షాలు కురవడం. తక్కువ సమయంలో ఊహించని స్థాయిలో వాన కురుస్తుంది. అనంతరం పెద్ద ఎత్తున వరద ముంచెత్తుతుంది. వాతావరణ శాఖ నిర్వచనం ప్రకార.. ఒక టి నుంచి 10 కి.మీ ప్రాంతంలో ఒక గంటలో 10 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే దాన్ని మేఘాల విస్ఫోటనం లేదా క్లౌడ్ బరస్ట్ అని పిలుస్తారు. ఒక్కోసారి ఒకే ప్రాంతంలో ఒకటి కన్నా.. ఎక్కువ సార్లు ఆకస్మికంగా కుండపోత వానలు కురవచ్చు. అలాంటప్పుడు ఊహకందని విధంగా నష్టం వాటిల్లుతుంది.
2013లో ఉత్తరాఖండ్‌లో ఇలాగే క్లౌడ్ బరస్ట్ వల్ల భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. పర్వత ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్‌లు ఎక్కువగా సంభవిస్తాయి. కొండలపై ఏర్పడిన మేఘాలు అధిక తేమను కలిగి తక్కువ సమయంలో భారీ వర్షాన్ని కురిపిస్తాయి. ఐతే మనదేశంలో తరచూ ఇలాంటివి విపత్తులు ఎక్కువగా జరుగుతుండడంతో.. వీటి వెనక విదేశీ కుట్ర ఉందేమోనని సీఎం కేసీఆర్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి కేసీఆర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.