తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్నదాతలకు రైతుబీమా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో గీత కార్మికులకు కూడా బీమా అందించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఇందులో భాగంగా ‘గీత కార్మికుల బీమా’ను అమలు చేయనున్నారు. కల్లు గీసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటంబాలకు ఈ బీమా వర్తించనుంది. మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల బీమా సాయాన్ని నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు. గీత కార్మికుల బీమా అమలుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావును కేసీఆర్ ఆదేశించారు.
ఈ మేరకు తెలంగాణ నూతన సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కల్లు గీసే సమయంలో ప్రమాదవశాత్తూ జారిపడి ప్రాణాలు కోల్పోతున్న దురదృష్ట సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఊహించని ఘటనల్లో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఆర్థిక సాయం అందిస్తున్నా బాధితులకు అందడంలో ఆలస్యం అవుతుందన్నారు. అందుకే రైతుబీమా తరహాలో గౌడన్నల కుటుంబాలను ఆదుకునేందుకు గీతకార్మికుల బీమా తీసుకొచ్చామని కేసీఆర్ పేర్కొన్నారు.