తెలంగాణ సీఎం కేసీఆర్ గత కొద్ది రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. వారం క్రితం ఉత్తరప్రదేశ్ సీఎం ములాయం సింగ్ అంత్యక్రియలకు హాజరైన సీఎం.. అటునుంచి అటే ఢిల్లీకి పయనమయ్యారు. అప్పటినుంచి కేసీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు. టీఆర్ఎస్ ఢిల్లీలో లీజుకు తీసుకున్న భవనం మరమ్మతులను పరిశీలించారు. అంతేకాకుండా పార్టీ కోసం కొత్తగా నిర్మిస్తున్న భవనం పనులను కూడా పరిశీలించి.. పలు సూచనలు, సలహాలు అందించారు. వారం రోజులుగా ఢిల్లీలోనే సీఎం కేసీఆర్ ఉన్నారు. తాజాగా కొందరు ఉన్నతాధికారులను ఢిల్లీకి రావాలని ఆదేశించారు.
సీఎం ఆదేశాలతో సీఎస్ సోమేశ్ కుమార్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ ఆరోగ్యం గురించి కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆయనకు జ్వరం వచ్చిందని చెబుతున్నారు. కేసీఆర్ మరో నాలుగు రోజులు ఢిల్లీలోనే ఉండనున్నట్లు చెబుతున్నారు. అయితే పాలనకు సంబంధించిన విషయాలు, ఆదేశాలు తెలియజేయడానికి మాత్రమే ఉన్నతాధికారులను ఢిల్లీ పిలిచారని.. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని కూడా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఏమీ చెప్పే పరిస్థితి లేదు.