దేశంలో అతిపెద్ద హనుమాన్ క్షేత్రంగా కొండగట్టు అంజన్న ఆలయం. రూ.600కోట్లతో సుమారు 850 ఎకరాల్లో కొండగట్టు ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్.
జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోన్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల ప్రజలు భక్తి శ్రద్ధలతో నిత్యం అంజన్న స్వామి దర్శనానికి విచ్చేస్తుంటారు. ఈ ఆలయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు సందర్శించారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో కొండగట్టుకు చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంజన్న దర్శనం తర్వాత సీఎం కేసీఆర్ ఆలయాన్ని పరిశీలించారు. అనంతరం ఆలయ పునర్మిర్మాణంపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పునర్మిర్మాణానికి రూ. 500 కోట్లను కేటాయిస్తున్నట్టుగా వెల్లడించారు. గతంలో ప్రకటించిన రూ. 100 కోట్లతో కలుపుకొని మొత్తం రూ. 600 కోట్లతో ఆలయ పునర్మిర్మాణ పనులను చేపట్టాలని కేసీఆర్ సూచించారు.
కొండగట్టు పర్యటనలో భాగంగా అధికారులతో సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి ఇప్పటికే రూ.100 కోట్లు ప్రకటించామని.. ఇప్పుడు మరో రూ.500కోట్లు (మొత్తంగా రూ.600కోట్లు) కేటాయించనున్నట్లు వెల్లడించారు. దేశంలోనే అతిపెద్ద ప్రముఖ ఆంజనేయ క్షేత్రంగా ఎక్కడ ఉందంటే కొండగట్టు అనే పేరు రావాలని.. ఆ విధంగా ఈ పుణ్యక్షేత్రాన్ని తీర్చిదిద్దాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రపంచాన్నే ఆకర్షించేలా అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దాలన్నారు. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధి బృహత్తర ప్రాజెక్ట్ అన్న కేసీఆర్, భక్తులకు సకల వసతులు, అన్ని హంగులతో ఆధ్యాత్మిక ఉట్టిపడేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్నారు.
దేశంలోనే గొప్పగా హనుమాన్ జయంతి కొండగట్టులో జరగాలి అన్నకేసీఆర్, వేల మంది ఒకేసారి హనుమాన్ దీక్ష ధారణ, విరమణ చేసే సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. సుమారు 850 ఎకరాలలో ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు చేయాలన్నారు. పెద్ద వాల్, పార్కింగ్, పుష్కరిణీ, అన్నదాన సత్రం, కళ్యాణ కట్ట, కోనేరు, సువిశాల పార్కింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. వసతులు గొప్పగా ఉంటే దర్శనానికి వచ్చే భక్తులు పెరుగుతారు అన్నారు. మళ్ళీ వస్తానని… ఆలయ అభివృద్ధి, విస్తరణపై మరోసారి సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. రూ.600కోట్లతో 850 ఎకరాల్లో కొండగట్టు ఆలయ అభివృద్ధి జరుగుతుండడంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.