చిన్నప్పుడు తప్పిపోవడం వల్ల ఓ ఊహాకు వచ్చే నాటికి తల్లిదండ్రుల ఆనవాళ్లు గుర్తు ఉండవు. దీంతో వీరిని అప్పగించేందుకు అధికారులు సైతం చేతులెత్తేస్తుంటారు. వీరిని పెంచి పెద్ద చేసిన అనాథ శరణాలయాలు, ఇతర ఆశ్రమాలు కూడా.. తమ దృష్టికి వస్తేనే ఇటువంటి కేసులను పరిష్కరిస్తాయి. కానీ ఇప్పుడు..
చిన్నప్పుడు తప్పిపోయిన పిల్లలు.. తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరడం అరుదుగా జరుగుతుంటుంది. చిన్నప్పుడు తప్పిపోవడం వల్ల ఓ ఊహాకు వచ్చే నాటికి తల్లిదండ్రుల ఆనవాళ్లు గుర్తు ఉండవు. దీంతో వీరిని అప్పగించేందుకు అధికారులు సైతం చేతులెత్తేస్తుంటారు. వీరిని పెంచి పెద్ద చేసిన అనాథ శరణాలయాలు, ఇతర ఆశ్రమాలు కూడా.. తమ దృష్టికి వస్తేనే ఇటువంటి కేసులను పరిష్కరిస్తాయి. కానీ ఇప్పుడు ఓ చిన్నారి విషయంలో అధికారులకు తలనొప్పి ఎదురైంది. ఓ గోవు కోసం ఇద్దరు మహిళలు తమదంటే తమది అని కొట్టుకున్న కథలాగా.. ఇప్పుడు రెండు కుటుంబాలు ఆ పాప తమదంటే తమదని పేర్కొంటున్నాయి.
వివరాల్లోకి వెళితే.. ఈ ఫోటో కనిపిస్తున్న పాప రెండేళ్ల వయస్సులో తల్లిదండ్రులకు దూరమైంది. ఎలా దూరమైందో తెలియదు. అయితే ఈ పాపకు ఏడేళ్లు వచ్చాయి. ఇప్పుడు ఆమెకు తల్లిదండ్రులం మేమేనంటూ రెండు జంటలు ముందుకు వచ్చాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన గాదెపాక భాగ్యలక్ష్మి హైదరాబాద్‌లోని బసవతారకం ఆసుపత్రిలో పనిచేస్తుంది. ఆమెతో పాటు ఆండాల్ అనే మహిళ కూడా పనిచేస్తుంది. ఇంట్లో నుండి తప్పిపోయిన చిన్నారి ఆండాల్ వద్దకు చేరింది. కొన్ని రోజుల పాటు పాప ఆమె దగ్గరే ఉంది. ఆండాల్ శ్రీకాకుళం వెళుతూ భాగ్యలక్ష్మికి అప్పగించింది. భాగ్యలక్ష్మి పాపను కరీంనగర్‌లోని ఆమె స్వంత గ్రామానికి తీసుకువచ్చింది. రెండు నెలల పాటు భాగ్యలక్ష్మి వద్దే ఉంది. అమ్మాయికి ఆరోగ్యం బాగోకకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లింది.
అయితే పాప లాంగ్వేజ్ వేరుగా ఉండటంతో ఎక్కడి నుండి తీసుకు వచ్చావని అడగ్గా.. ఆమె సమాధానం చెప్పలేదు. దీంతో స్థానికులు ఆ పాప ఫోటో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది చూసిన పోలీసుల పాపను బాలల పరిరక్షణ కేంద్రానికి తరలించారు. ఇంతలో శ్రీకాకుళానికి చెందిన రవి చందర్ పాప తమదేనంటూ పోలీసులను ఆశ్రయించారు. అయితే పాప వారిని గుర్తించకపోవడంతో అప్పగించలేదు. ఇంతలో తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదికి చెందిన ఓ మహిళ..తమ మనువరాలే అని చెప్పింది. తల్లిదండ్రులు వేరో దేశంలో ఉంటారని పేర్కొంటూ.. వీడియో కాల్ ద్వారా మాట్లాడించారు. అయితే ఇద్దరు దంపతులు ముందుకు రావడంతో ఏమీ తేల్చుకోలేని అధికారులు.. పాపకు డిఎన్ఎ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు.