కిషన్ రెడ్డి.. స్టేట్ నుంచి సెంట్రల్ దాకా బాగా వినిపిస్తూ ఉండే పేరు. ఒక సాధారణ కార్యకర్త నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎదిగారు. ఎంపీగా గెలిచిన మొదటిసారే కేంద్రమంత్రి కూడా అయ్యారు. ఇప్పుడు 3 శాఖల బాధ్యతలను నిర్వర్తిస్తూ ఎంతో బిజీగా ఉంటున్నారు. రాజకీయ నాయకుడిగా కిషన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నిబద్ధత, సేవాగుణం, సమస్యల పట్ల స్పందించే తీరు అందరికీ తెలుసు. కానీ, సాధారణ వ్యక్తిగా ఆయన ఇష్టాలేంటి? ఆయనకు ఎలాంటి ఆహారం ఇష్టం? ఎలాంటి సినిమాలు చూస్తారు? కుటుంబంతో ఎలా గడుపుతారు? అనే విషయాలు చాలా మందికి తెలీదు. అలాంటి ఆసక్తికర విషయాలను సుమన్ టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో స్వయంగా ఆయన సతీమణి కావ్యారెడ్డి వెల్లడించారు. మరి ఆ వివరాలేంటో మీరూ చదివేయండి…
“చాలా విషయాల్లో నేను కిషన్ రెడ్డి గారిని ఫాలో అవుతూ ఉంటాను. ఆయన చాలా సింపుల్ గా ఉంటారు. హోదా ఎంత పెరిగినా మనం మాత్రం సాధారణంగానే ఉండాలి అనేది ఆయన ఎప్పుడూ చెబుతూ ఉండే మాట. కేంద్రమంత్రిగా ఎదిగినా.. సాధారణ కార్యకర్తగా ఎలా ఉండేవారో అలాగే ఉంటారు. రాజకీయాల్లో ఆయన చాలా హుందాగా వ్యవహరిస్తారు. ఎప్పుడూ ఏ నేత గురించి వ్యక్తిగతంగా దూషించరు, తప్పుగా మాట్లాడరు. ఆయన ఏదైనా చెప్పాలి అనుకున్నా చాలా చక్కగా చెప్తారు. అందుకే ఆయన గురించి ఎవరూ తప్పుగా మాట్లాడటం, విమర్శించడం చేయరు.”
“ఆయనకు పార్టీ అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ పార్టీ గురించే ఆలోచిస్తూ ఉంటారు. నియోజకవర్గం గురించి కూడా ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. ఎంత బిజీగా ఉన్నా వారంలో మూడు రోజులు కచ్చితంగా హైదరాబాద్ లోనే ఉంటారు. అది తినాలి, అక్కడికి వెళ్లాలి, అలా ఎంజాయ్ చేయాలి అలాంటి ఆలోచనలు అస్సలు ఉండవు. పార్టీ తర్వాత ఆయనకి పిల్లలు అంటే చాలా ఇష్టం. మాతో టైమ్ స్పెండ్ చేయలేకపోతున్నానే అని చాలా బాధపడుతూ ఉంటారు. కానీ, మాకు ఆయన అవసరం ఉన్నప్పుడు మాత్రం మా పక్కనే ఉంటారు. ఆయన బాధ్యతలను ఎప్పుడూ విస్మరించరు. మా ఇష్టాలను, అభిరుచులను ఎప్పుడూ కాదనరు, అడ్డు చెప్పరు.”
“సంవత్సరంలో ఒకసారి మాత్రం టూర్ కి వెళ్తూ ఉంటాం. ఆ సమయంలో ఒక ఐదు రోజులు మాకు సమయం కేటాయిస్తారు. ఇంక సినిమాలు, షికార్లు వంటి వాటిపై ఆయనకు ఆసక్తి ఉండదు, అసలు సమయం కూడా దొరకదు. ఆయన ఇష్టపడే సినిమాలు అంటే.. రామ్ గోపాల్ వర్మ సినిమాలు బాగా ఇష్టపడతారు. ఆర్జీవీ సినిమాలను ఇష్టంగా చూసేవారంట. హీరోయిన్స్ అయితే ఆయనకు శ్రీదేవీ అంటే ఇష్టం. నేను వేరే ఇంటర్వ్యూ చూసి ఆ విషయం తెలుసుకున్నాను. కుటుంబానికి ఆయన సమయం కేటాయించలేకపోతున్నారు అని కొన్నిసార్లు బాధపడినా.. ఒక రాజకీయ నేతగా ఆయన చేస్తున్న సేవ చూసి చాలా సంతోష పడుతూ ఉంటాను. ఆయనకు భార్యను అయినందుకు నేను ఎప్పుడూ గర్వపడుతూనే ఉంటా” అంటూ కిషన్ రెడ్డి సతీమణి వ్యాఖ్యానించారు. కావ్యారెడ్డి పంచుకున్న మరెన్నో ఆసక్తికర విషయాల కోసం కిందనే ఉన్న ఫుల్ ఇంటర్వ్యూ చూసేయండి.