ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ ప్రభావం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై పడుతోంది. ఈడీ రిమాండ్ రిపోర్టులో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కుమార్తె కవిత పేరు ఉన్న విషయం తెలిసిందే. విచారణ కోసం సీబీఐ నోటీసులు కూడా జారీ చేసింది. అందుకు కవిత పూర్తి సహకారం అందిస్తామంటూ డిసెంబర్ 6న ఉదయం 11 గంటలకు తమ నివాసంలో విచారణకు హాజరవుతామంటూ తెలిపారు. అయితే తర్వాత ఎమ్మెల్సీ కవిత సీబీఐకి లేఖ రాశారు. కేంద్ర హోంశాఖ ఏమని ఫిర్యాదు చేసింది? ఎఫ్‌ఐఆర్ కాపీలో ఏం ప్రస్తావించారు? ఈ విషయాలు తెలిజేస్తే వివరాలు తెలియజేసేందుకు సులువుగా ఉంటుందని.. వీలైనంత త్వరగా ఆ కాపీలు పంపితే విచారణకు సహకరిస్తామంటూ తెలియజేశారు.
ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ తెలంగాణలో టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మారిపోయింది. కేంద్రం సీబీఐ, ఈడీలాంటి సంస్థలను అడ్డుపెట్టుకుని తమపై కక్ష సాధిస్తోంది అంటూ ఆరోపణలు చేస్తున్నారు. కావాలనే ఎమ్మెల్సీ కవిత పేరును ఈ లిక్కర్ స్కామ్‌లో చేర్చారంటూ విమర్శలు చేస్తున్నారు. అటు బీజేపీ చూస్తే ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారు? విచారణకు సహకరిస్తే మీరు ఎలాంటి తప్పు చేయకపోతే నిర్దోషిగా బయటపడతారు కదా? అంటూ ఎద్దేవా చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే, అడ్వకేట్ రఘునందన్ రావు ఓ డిబేట్ లో పాల్గొని ఈ కేసుపై పలు వ్యాఖ్యలు చేశారు.
“మొదట ఆరో తారీఖు విచారణకు అంగీకరించి.. మళ్లీ ఎఫ్‌ఐఆర్ కాపీలు అడుగుతున్నారు అంటే దర్యాప్తును ఆలస్యం చేసేందుకే. మేం కొన్ని కాపీలు అడిగాం, మీరు వాటిని మాకు ఇవ్వడంలో ఆలస్యం చేశారు. నేను వాటిని చదువుకోలేదు, ఇంకా కాస్త సమయం కావాలి అంటూ ఇంకో పదిరోజులు ఆలస్యం చేస్తారు. ఎఫ్‌ఐఆర్‌లో కవిత పేరు లేదని కొందరు వాదిస్తున్నారు. అందరి పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో ఉండాలని లేదు. మరికొందరు అని ఉంటుంది. ఆ మరికొందరు ఎవరు అనేది విచారణలో తెలుస్తుంది. కొందరిని నిందితులుగా చేర్చవచ్చు, ఇంకొందరిని సాక్షులుగా పిలవచ్చు. ఈడీ, సీబీఐ తమ దర్యాప్తును నిర్వహిస్తున్నారు. వారి దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత కవితగారి ప్రమేయం ఉందని తేలితే.. అందుకు తగిన సాక్షాధారాలు ఉంటే వారిని కూడా అరెస్టు చేస్తారు. అయితే ముందు వారి దర్యాప్తు, ఆధారాల సేకరణ చేయనివ్వండి” అంటూ రఘునందన్‌రావు వ్యాఖ్యానించారు.