బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి చోటుచేసుకుంది. ఈ సమ్మేళనంలో పాల్గొనేందుకు వచ్చిన ఒక వ్యక్తి గుండెనొప్పితో చనిపోయారు.
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి చోటుచేసుకుంది. సమ్మేళనంలో పాల్గొనేందుకు వచ్చిన ఓ వ్యక్తి మృతి చెందారు. దీంతో అక్కడ విషాద ఛాయలు అలముకున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మలరామారం మండలంలో ఈ ఘటన జరిగింది. మండలంలోని చీకటిమామిడిలో శుక్రవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కంచలతండాకు చెందిన ధీరావత్ నాను నాయక్ ఈ సమ్మేళంలో పాల్గొన్నారు. కార్యక్రమం జరుగుతుండగా నాను నాయక్ గుండెపోటుకు గురై కన్నుమూశారు. దీంతో పార్టీ కార్యకర్తలు, నేతలు దిగ్భ్రాంతికి లోనయ్యారు.
ఇటీవల ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలోనూ అపశృతి చోటుచేసుకున్న విషయం విదితమే. నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు నాయక్తో పాటు పలువురు నేతలు కార్యక్రమం జరుగుతున్న ప్రాంతానికి చేరుకుంటున్న తరుణంలో పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ క్రమంలో బాణసంచాను పేల్చడం మొదలుపెట్టారు. ఈ టైమ్లో ఒక తారాజువ్వ ఎగిరి పక్కనే ఉన్న గుడిసె మీద పడింది. దీంతో గుడిసెకు నిప్పు అంటుకుంది. గుడిసెలో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. 10 మందికి పైగా తీవ్రంగా గాయాలపాలయ్యారు.