కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యకర్తలు కర్రలు, కుర్చీలు విసిరి దాడికి యత్నించారు. వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ కార్యకర్తలు వారిపై ఎదురుదాడికి దిగారు. ఇటుకలపాడులో బొడ్డరాయి విగ్రహ ప్రతిష్టాపనకు హాజరైన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. నల్లగొండలో జిల్లాలోని ఇటుకలపాడులో బొడ్డరాయి విగ్రహ ప్రతిష్టాపనకు హాజరైన వెంకట్ రెడ్డిని రోడ్ల విషయమై స్థానికులు నిలదీశారు. ఆయన ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో కోపోద్రిక్తులైన బీఆర్ఎస్ కార్యకర్తలు అతనిపై కుర్చీలు, కర్రలు విసిరి దాడికి యత్నించారు. వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలపై ఎదురుదాడికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం, జరిగింది. కాసేపు అక్కడ బీఆర్ఎస్ vs కాంగ్రెస్ అన్నట్లుగా రణరంగంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
నల్గొండ జిల్లా, తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇటుకులపాడు గ్రామంలో గురువారం నాడు బొడ్డురాయి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. దీనికి హాజరవ్వాల్సిందిగా వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది. అందులో భాగంగా అక్కడికి బయలుదేరిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాస్త ఆలస్యంగా అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆలస్యంపై వివరణ ఇవ్వబోయి.. మీ గ్రామానికి రావడానికి మూడు కి.మీ దూరానికి గంటల సమయం పట్టిందని, కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని కేసీఆర్ అధోగతి కి గురి చేశారని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు.. రోడ్ల దుస్థితితో పాటు తమ నాయకుడిపై విమర్శలు చేస్తావా..? అంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కుర్చీలు, కర్రలతో దాడికి యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు వారిపై ఎదురుదాడికి దిగారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టడంతో అక్కడితో వివాదం సద్దుమణిగింది. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సురక్షితంగా అక్కడి నుంచి పంపించారు.