బలగం సినిమాను చూసిన ప్రతి ఒక్కరు కళ్లు చెమర్చకుండా ఉండలేరు. గ్రామీణ ప్రాంత వాసుల తీరు, తెన్నులను సినిమాలో చక్కగా చూపించారు. కేవలం గ్రామీణ ప్రజలే కాకుండా నగర, పట్టణ వాసులు కూడా ఈ సినిమాను తిలకించి భావోద్వేగాలకు గురవుతున్నారు. ఈ సినిమాతో అనేక కుటుంబాలు కూడా కలిశాయి. తాజాగా ..
బలగం, బలగం, బలగం ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా ఈ సినిమా గురించే చర్చ. తెలిసిన వ్యక్తులు ఎదురు పడుతున్న సమయంలో ముందు బాగున్నారా అనే కుశల ప్రశ్న కన్నా బలగం సినిమా చూశారా అన్న ప్రశ్నే ఎదురవుతుంది. ఎందుకంటే ఆ సినిమా చేసిన ఇంపాక్ట్ అంతలా ఉంది మరీ. ఇటీవల కాలంలో రియాలిటీలో కాకుండా రీల్ లైఫ్‌లో కూడా కనుమరుగవుతున్న అనుబంధాలను మళ్లీ కొత్తగా ప్రేక్షకులకు పరిచయం చేశారు దర్శకుడు వేణు. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు కళ్లు చెమర్చకుండా ఉండలేరు. గ్రామీణాల్లో ఉండే ప్రేమలు, తగాదాలు, అలకలు, ఆప్యాయతలు, సెటైర్లు అన్ని ఈ సినిమాలో ఉన్నాయి. కేవలం గ్రామీణ ప్రజలే కాకుండా నగర, పట్టణ వాసులు కూడా ఈ సినిమాను తిలకించి భావోద్వేగాలకు గురవుతున్నారు.
ఇప్పటికే ఈ సినిమా.. శత్రువులుగా మారిన సొంత అన్నదమ్ములను కలిపింది. నిర్మల్ జిల్లాకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఆస్తి వివాదంలో గొడవలు కారణంగా విడిపోగా.. ఈ సినిమాను చూసి కలిశారు. అలాగే సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మండలం మాసన్ పల్లి చెందిన 8 నాయి బ్రాహ్మణ కుటుంబాలు ఈ సినిమా చూసి కలిశాయి. మంచిర్యాల జిల్లాలో మరో కుటుంబం కలిసిపోయింది. 45 ఏళ్ల కిందట విడిపోయిన ఓ కుటుంబం బలగం సినిమా ద్వారా ఏకమైంది. ఇప్పుడు ఇదే సినిమా అక్కా తమ్ముడి కుటుంబాలను కలిపింది. 15 ఏళ్ల క్రితం అకారణంగా విడిపోయిన ఈ అక్కా తమ్ముళ్లు ఎట్టకేలకు కలిసిపోయారు. వీరిది తెలంగాణలోని వనపర్తి జిల్లా.
వనపర్తిలోని ఓ గ్రామానికి చెందిన అక్కా తమ్ముళ్లు లక్ష్మి, లింగారెడ్డిలు. లక్ష్మిని అదే గ్రామంలో పప్పు వీరారెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. రెండు కుటుంబాలు వనపర్తిలోనే ఉంటున్నాయి. 15 ఏళ్ల క్రితం తమ్ముడు లింగారెడ్డి కూతురు రజిని వివాహ వేడుకల్లో లక్ష్మిని ఫొటో తీయకపోవడంతో భోజనం చేయకుండా ఆమె అలిగి వెళ్లిపోయింది. అప్పటి నుండి ఈ కుటుంబాలు ఎడమొహం, పెడ మొహంగా ఉన్నాయి. ఏడాదిన్నర క్రితం లక్ష్మి భర్త వీరారెడ్డి మృతి చెందగా.. అంత్యక్రియల సమయంలో లింగారెడ్డి అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉండటంతో అతడు రాలేకపోయాడు. దీంతో అతడి భార్య వసంత, కొడుకు శ్రీకాంత్‌రెడ్డి అంత్యక్రియలకు వెళ్లొచ్చారు.
అయినా రెండు కుటుంబాలు కలిసిపోలేదు. మాటలు కలవలేదు. అయితే ఇటీవల ఆ ఊరి సర్పంచ్ ఉంగరాల శ్రీధర్ గ్రామంలో బలగం సినిమాను పంచాయతీ కార్యాలయం వద్ద ప్రదర్శించారు. ఆ సినిమా చూసిన లింగారెడ్డి, లక్ష్మిలు బాధతో కన్నీరు పెట్టుకున్నారు. అక్కను కలవాలని తమ్ముడు భావించాడు. పంతాలు వదిలేసి సర్పంచ్ శ్రీధర్, గ్రామస్తులు మహేష్, రవీందర్‌రెడ్డి సమక్షంలో ఈనెల 15న లింగారెడ్డి తన అక్క లక్ష్మి ఇంటికి వెళ్లాడు. ఈ 15 ఏళ్ల తర్వాత అక్కా తమ్ముళ్లు కలవడంతో బోరుమంటూ ఆనంద భాష్పాలు రాల్చుకున్నారు. వీరు కలవడంతో ఇరు కుటుంబ సభ్యులే కాదూ, గ్రామస్తులంతా ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమా చూసి మీరు విభేదాలు పక్కన పెట్టి ఎవరితోనైనా కలవాలనుకుంటున్నారా.. అయితే కామెంట్ల రూపంలో తెలియజేయండి.