జీవితంలో ఎప్పుడు ఏ విషాదం చోటుచేసుకుంటుందో తెలుసుకోలేము. ఊహించని ప్రమాదాలతో అప్పటి వరకు ఆనందంగా సాగుతున్న కుటుంబం ఒక్కసారిగా అలజడికి గురవుతుంది. తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది.
ప్రాణం నీటిమీది బుడగ వంటిది. ఎప్పుడు ఎలా ఊపిరిపోతుందో ఊహించలేము. ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా వస్తున్న హార్ట్ స్ట్రోక్ లు, ఇతర అనారోగ్య కారణాల వల్ల అప్పటి వరకు ఎంతో ఆనందంగా గడిపిన వారు విగతజీవులుగా మారుతున్నారు. కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. దీనికి గల కారణాలు తీసుకునే ఆహార పదార్థాలు, జీవన శైలిలో చోటుచేసుకున్న మార్పులు ఇంకా ఇతర కారణాలు ఉన్నాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు కూడా బ్రేయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ తో మృతి చెందుతున్నారు. ఇదే విధంగా తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఓ బాలుడి ఆకస్మిక మరణం తల్లిదండ్రులకు విషాదాన్ని మిగిల్చింది. వివరాల్లోకి వెళ్తే..
అడ్డాకుల మండలం వర్నె గ్రామంలో చిట్టెమ్మ, సహదేవ్ దంపతులున్నారు. వీరికి ముగ్గురు కొడుకులు. వీరిలో రెండవ కుమారుడు సుశాంత్. ఈ బాలుడి వయసు పదిహేను సంవత్సరాలు. కాగా సుశాంత్ దేవరకద్ర మండలంలోని పేరూరు జెడ్పీ హైస్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్నాడు. అయితే శనివారం సాయంత్రం ఇంటి వద్ద సుశాంత్ ఒక్కసారిగా అనారోగ్యానికి గురై కుప్పకూలి పోయాడు. వెంటనే కుటుంబసభ్యులు సుశాంత్ ను మహబూబ్ నగర్ లోని ఓ హాస్పిటల్ కు తరలించారు.
అక్కడ బాలుడిని పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనట్లు తెలిపారు. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ కు తరలించి ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స ప్రారంభమైన గంటలోనే ప్రాణాలు కోల్పోయాడు సుశాంత్. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు ఆకస్మాత్తుగా మరణించడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. దీంతో వర్నె గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.