ఈ మద్య చిన్న పిల్లలను ఒంటరిగా వీధుల్లోకి పంపించాలంటే తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా పిల్లలపై కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల అంబర్ పేట్ ఘటన మరువక ముందే అలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ పునరావృతం అవుతూనే ఉన్నాయి.
ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల దాడులు తీవ్రమవుతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ చిన్న పిల్లలపై వీధి కుక్కల దాడి జరుగుతుంది. ఇటీవల అంబర్ పేట్ లో నాలుగేళ్ల ప్రదీప్ అనే చిన్నారిని వీధి కుక్కలు దాడి చేసి క్రూరంగా చంపాయి. ఈ ఘటన మరువక ముందే రాష్ట్రంలో పలు చోట్ల వీధి కుక్కల దాడుల్లో పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు.. కొంతమంది చనిపోయారు. సాధారణంగా ఇలాంటి ఘటనలు జరిగినపుడు వెంటనే ప్రభుత్వం స్పందించి కాస్త హడావుడి చేసినా.. తర్వాత షరా మామూలే అంటున్నారు బాధితులు. తాజాగా ఓ నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి.. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి రేగుల తండా లో అంగన్వాడి కేంద్రం వద్ద నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దారుణంగా దాడి చేశాయి. బాలుడు తండ్రి ఇస్లావత్ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. తన కుమారుడు అక్షయ్ నాయక్.. వయసు నాలుగు సంవత్సరాలు. ముత్యాలమ్మ గుడి సమీపంలో ఉన్న అంగన్వాడి కేంద్రానికి వెళ్తున్నాడు. అంగన్ వాడి కేంద్రం నుంచి అక్షయ్ నాయక్ టాయిలెట్ కోసం బయటకు వచ్చాడు. అంతే ఒక్కసారిగా బయట కాపు కాసి ఉన్న కుక్కలు అక్షయ్ నాయక్ పై దాడి చేసి కరిచాయి. బాలుడు కేకలు వేయడంతో వెంటనే అంగన్ వాడి సిబ్బంది వెళ్లి కుక్కలను తరిమికొట్టారు. ఈ దాడిలో బాలుడి ఎడమ కాలికి తీవ్రంగా గాయం కావడంతో వెంటనే స్థానికు సులానగర్ పీహెచ్సీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
పుట్టిన రోజు నే ఇలాంటి సంఘటన జరగడంతో అక్షయ్ నాయక్ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా టేకులపల్లి మండల పరిధిలో వీధి కుక్కల బెడద రోజు రోజుకీ పెరిగిపోతుందని.. ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయని.. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకొని కుక్కకల బెడద లేకుండా చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కుక్కలు చిన్న పిల్లలను టార్గెట్ చేసుకొని దాడులు చేస్తున్నాయి. మొన్న మెదక్ జిల్లాలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ ఏడేళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి.. తీవ్రంతో అమ్మాయి తీవ్రంగా గాయపడింది.. హైదరాబాద్ కి తరలించి మెరుగైన చికిత్స అందించారు.