హైదరాబాద్ లోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీకి గుర్తు తెలియని బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ చేశాడు. దీంతో కంపెనీ యాజమాన్యం, ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు.
ప్రముఖ కంపెనీలకు, సంస్థలకు, పోలీసులకు బాంబు బెదిరింపు కాల్స్ వస్తుంటాయి. విమానాశ్రయాలు, ప్రముఖ ఏరియాల్లో బాంబు పెట్టామని కొంతమంది బెదిరిస్తుంటారు. దీంతో పోలీసులు వెంటనే బాంబ్ స్క్వాడ్ తో అలర్ట్ అవుతారు. వీటిలో నిజాలు ఉంటాయి, ఫేక్ కాల్స్ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఫేక్ కాల్స్ అనేవి ఎక్కువైపోయాయి. కొంతమంది ఆకతాయిలు కావాలని ఫోన్లు చేసి బాంబు ఉందంటూ బెదిరిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీకి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. మీ కంపెనీలో బాంబు ఉందంటూ బెదిరించడంతో యాజమాన్యం, ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు.
మాదాపూర్ లోని కొత్తగూడెంలో ఉన్న టీసీఎస్ కంపెనీకి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఒక వ్యక్తి కాల్ చేసి బాంబు ఉందంటూ బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన కంపెనీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. బాంబ్ స్క్వాడ్ తో పోలీసులు కంపెనీ వద్దకు చేరుకున్నారు. ఉద్యోగులను బయటకు పంపించి బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో బాంబు లేదని పోలీసులు నిర్ధారించడంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. ఫేక్ కాల్ అయి ఉంటుందని పోలీసులు నిర్ధారించారు. బాంబు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. గతంలో టీసీఎస్ కంపెనీలో సెక్యూరిటీ సిబ్బందిగా చేసిన వ్యక్తి బాంబు బెదిరింపు కాల్ చేశాడని పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.