హైదరాబాద్ పాతబస్తీలో బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. చార్మినార్ దగ్గర బాంబు పెట్టినట్లు కొంతమంది ఆగంతకులు కాల్ చేసి బెదిరించడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులు చార్మినార్ కి చేరుకొని పరిసరాల్లో బాంబ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు చేపట్టారు. దాదాపు రెండు గంటల సేపు బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. చేస్తూనే ఉన్నారు. చార్మినార్ దగ్గర ఫుట్ పాత్ లపై ఉన్న షాపు యజమానులను అక్కడి నుంచి పంపించేశారు. చార్మినార్ దగ్గర షాపులు, హోటళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అయితే ఎక్కడా బాంబు దొరక్కపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఫేక్ కాల్ అయి ఉంటుందని, ఎవరో ఆకతాయిలు చేసిన పనిగా పోలీసులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎక్కడి నుంచి కాల్ వచ్చిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఏ నంబర్ నుంచి కాల్ వచ్చిందో ఆ నంబర్ ని ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలా బాంబు బెదిరింపు కాల్ రావడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో కూడా చార్మినార్ దగ్గర బాంబు పెట్టమంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయి. అప్పుడు కూడా ఇలానే పోలీసులు హుటాహుటిన పరుగులు పెట్టి తనిఖీలు చేపట్టారు. బాంబు లేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.