భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ ముస్తాబవుతోంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలు హాజరుకానున్నారు. దేశ ప్రధానికి వండి, వడ్డించడమంటే.. ఫైవ్ స్టార్ హోటల్‌లో చేయి తిరిగిన దిగ్గజ చెఫ్ అయ్యుండాలి.. అయితే ఈసారి ప్రధాని మోదీకి ఓ సామాన్యురాలి చేతి వంట రుచి చూడబోతున్నారు. ఇంతకీ ఆ సామాన్యురాలు ఎవరు.. ఆమె ప్రత్యేకత ఏంటీ? అన్న విషయం గురించి తెలుసుకుందాం..
జులై 2 నుంచి జరగనున్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోదీ సహా దిగ్గజ నేతలు హాజరుకానున్నారు. ఆ సమావేశాలను తెలంగాణ బీజేపీ నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. వీరందరికీ తెలంగాణ సంప్రదాయ రుచులు రుచి చూపించాలని నిర్ణయించారు. దీంతో తెలంగాణ స్పెషల్ వంటకాలను ఏరికోరి మెనూలో చేర్చారు. ముఖ్యంగా ప్రధాని మోదీకి తెలంగాణ రుచులు చూపించాలని బీజేపీ నేతలు భావించారు. ఇందుకోసం కరీంనగర్ జిల్లాకు చెందిన గూళ్ల యాదమ్మను ఎంపికచేశారు.
గూళ్ల యాదమ్మ నేపథ్యం:
కరీంనగర్ జిల్లాకు చెందిన గూళ్ల యాదమ్మ దాదాపు 30 సంవత్సరాలుగా వంటలు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. యాదమ్మ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లి గ్రామం. ఆమెకు తన పదిహేనవ ఏటనే వివాహం జరిగింది. వీరికి ఒక బాబు పుట్టిన తర్వాత అనుకోని ప్రమాదంలో ఆమె భర్త కన్నుమూశాడు. భర్త చనిపోయిన తర్వాత ఆమెకు అత్తింటి వేధింపులు ఎక్కువ అయ్యాయి. దీంతో తన మూడు నెలల బాబు ని తీసుకొని కరీంనగర్ కి వచ్చింది. ఇక్కడ వెంకన్న అనే వంట మాస్టర్ వద్ద వంటలు నేర్చుకుంది. అప్పుడు ఆమెకు రూ.15 కూలీ ఇచ్చేవారు. ఆయన వద్ద మంచి మెలుకువలు నేర్చుకొని తన సొంతంగా ఏదైనా చేయాలని నిశ్చయించుకుంది.
ఇలా కొంతమంది మహిళలను కలుపుకొని బృందంగా ఏర్పడి సొంతంగా వంటలు చేయడం ప్రారంభించింది. అలా యాదమ్మ వంటలు అందరికీ నచ్చడంతో తన టీమ్ పెద్దగా చేసింది. దాదాపు 20 వేల మంది మహిళలకు ఉపాధి కల్పించే స్థాయికి చేరుకుంది. ఆమె వద్ద పనినేర్చుకున్నవారు కూడా సొంతంగా కేటరింగ్ చేస్తున్నారు. యాదమ్మ చాలా మంది పేద విద్యార్థులకు సైతం ఉపాధి కల్పిస్తుంది. ఫంక్షన్ల స్థాయిని బట్టి రూ.500 నుంచి రూ.2000 వరకు ఇస్తుంది. యాదమ్మ చేసే శాకాహార, మాంసాహార వంటకాలు అంటే ఇక్కడి వారి తెగ ఇష్టం. ఈమె ఒకేసారి పదివేల మందికి సులభంగా వండివార్చేస్తారని అంటారు. కరీంనగర్ లో పెద్ద పెద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్వహించే కార్యక్రమాల్లో యాదమ్మ వంటు ఎంతో ప్రత్యేకం. ఈమె వంటలు మంత్రి కేటీఆర్ కూడా మెచ్చుకున్నారు. బండి సంజయ్ కి ఈమె వంటకాలు అంటే మహా ఇష్టం.
ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో యాదమ్మతో వంటలు చేయించాలని నిర్ణయించారు. ఆయన నుంచి పిలుపు అందిన వెంటనే యాదమ్మ హైదరాబాద్ చేరుకున్నారు. గంగవాయిలి కూర పప్పు, పుంటి కూర పప్పు, మామిడికాయ పప్పు ను వండి ఏకంగా మోదీకి వడ్డించనున్నారు. హైదరాబాద్‌కి వస్తున్న మోదీ సారుకి నువ్వే వంటలు చేయాలని చెప్పడంతో యాదమ్మ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. యాదమ్మ కొడుకు చదువు పూర్తి చేసుకొని తల్లికి చేదోడువాదోడుగా నిలుస్తున్నాడు.
ఈ సందర్భంగా యాదమ్మ మాట్లాడుతూ.. ‘మెదీ సారు కి తెలంగాణ ప్రత్యేక వంటలు కావాలని సంజయ్ సారు నన్ను హైదరాబాద్ కి రమ్మన్నారు.. ఎంతో సంతోషంగా ఉంది.. అన్ని రకాలు వంటకాలు, పప్పులు, స్వీట్లు తయారు చేసి పెడతాను. దేశ ప్రధాని మోదీ సార్ కి వంటల చేసి పెట్టడం నా పూర్వ జన్మ సుకృతం’ అంటూ సంతోషం వ్యక్తం చేసింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.