బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్ళారు.
భారతీయ జనతా పార్టీ నేత, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం రాత్రి ఛాతీలో నొప్పి వస్తుండడంతో 10:50 గంటలకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. కార్డియో న్యూరో సెంటర్ లోని కార్డియాక్ కేర్ యూనిట్ లో ప్రత్యేక వైద్య బృందం ఆయనకు పరీక్షలు నిర్వహించారు. ఆయనకు గ్యాస్ట్రిక్ సమస్యగా వైద్యులు నిర్ధారించి చికిత్స అందించారు. కడుపులో గ్యాస్ సమస్య వల్ల ఛాతీ నొప్పి వచ్చిందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాగా శనివారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో గంగా పుష్కర యాత్ర.. పూరీ-కాశీ-అయోధ్య భారత్ గౌరవ్ టూరిస్టు రైలును జెండా ఊపి ప్రారంభించారు కిషన్ రెడ్డి.
భారత్ గౌరవ్ రైళ్లను ప్రవేశ పెట్టడం ద్వారా దేశ, విదేశాలకు చెందిన యాత్రికులకు మన దేశంలో అద్భుతమైన చారిత్రక ప్రదేశాలను సందర్శించే గొప్ప అవకాశం, గొప్ప అనుభూతి భారతీయ రైల్వే కల్పిస్తుందని ఆయన అన్నారు. చాలా హుషారుగా కనిపించిన ఆయన ఆదివారం కూడా అంతే హుషారుతో కనిపించరు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ సందర్భంగా ఆదివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమానికి కిషన్ రెడ్డి హాజరయ్యారు. నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్ ప్రాంగణంలో మన్ కీ బాత్ కార్యక్రమం జరిగింది. మోదీ ప్రస్తావించిన అంశాల ఆధారంగా ఆర్ట్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖితో కలిసి కిషన్ రెడ్డి ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించారు.
అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమంపై ప్రశంసల వర్షం కురిపించారు. మన్ కీ బాత్ దేశ సంస్కృతిని, వారసత్వాన్ని, చరిత్రను తెలియజేస్తుందని అన్నారు. అయితే రాత్రి ఆయన అస్వస్థతకు గురవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. తినే ఆహారంలో గ్యాస్ ఎక్కువైతే కడుపులోని పేగులు ఉబ్బిపోతాయి. అందువల్ల గ్యాస్ బయటకు రాకుండా ఇబ్బంది పెడుతుంది. దీంతో కడుపు నొప్పి మొదలై.. ఆ తర్వాత ఛాతీ నొప్పి వస్తుంది. అయితే అది గుండెపోటు కాదని.. కడుపులో గ్యాస్ బయటకు పోతే నొప్పి పోతుందని నిపుణులు చెబుతున్నారు. గుడ్లు, బఠాణీలు, బీన్స్, శనగలు వంటివి కడుపులో అధిక గ్యాస్ కి కారణమవుతాయి. వీలయితే వీటిని తినడం తగ్గించమని నిపుణులు సూచిస్తున్నారు.