హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎంతగా వేడెక్కాయి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హుజూరాబాద్ పై పట్టు సాధించేందుకు బీజేపీ, టీఆర్ఎస్ గట్టిగానే ప్రయత్నాలు చేశాయి. అయితే.., దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించిన ఈ ఎన్నికల ఫలితాలు తాజాగా వెలువడ్డాయి. హుజూరాబాద్ లో అధికార పార్టీకి షాక్ ఇస్తూ.. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయాన్ని సాధించారు. టి.ఆర్.ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై ఈటల రాజేందర్ 23,865 ఓట్ల మెజారిటీని సాధించడం విశేషం.
టీఆర్ఎస్ స్థాపించిన నాటి నుండి ఈటల ఆ పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ, పార్టీకి విధేయుడిగా గుర్తింపు దక్కించుకున్నారు. అలాంటి నేతని అవినీతి ఆరోపణలతో సొంత పార్టీ నేతలే అవమానకర రీతిలో మంత్రి పదవి నుండి తొలగించడం, పార్టీకి దూరం చేయడం వంటి అంశాలు హుజురాబాద్ ఓటర్స్ కి నచ్చలేదు. ఇక్కడ ఈటలకి సింపతీ ఓటింగ్ బాగా దక్కినట్టు ఈ ఫలితాలను చూస్తే అర్ధం అవుతోంది.
ఇక హుజారాబాద్ టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని అందరికీ తెలిసిందే. అయితే.., దశాబ్దాలుగా కష్టపడి నియోజకవర్గాన్నికంచుకోటగా మరల్చింది మాత్రం ఈటల రాజేందర్. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, మున్నూరు కాపు, పద్మశాలి, గౌడ , ముదిరాజ్ సామాజిక వర్గాలు గెలుపోటములను ప్రభావితం చేశాయి. ఇక ఈటల రాజేందర్ ‘ముదిరాజ్’ సామాజిక వర్గానికి ఉన్న 24 వేల ఓటర్లు ఆయనకి మద్దతుగా నిలిచారు. ఈ సామాజిక సమీకరణాలు ఈటల గెలుపుకి కారణం అయ్యాయని చెప్పుకోవచ్చు.
మరోవైపు టి.ఆర్.ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ చివరి వరకు పోరాడినా విజయాన్ని అందుకోలేకపోవడంతో గులాబీ నేతలు నిరాశలో మునిగిపోయారు. ఇక ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ఓటర్లు సీరియస్ గా తీసుకోలేదు. కనీసం కొంతమంది స్వతంత్ర అభ్యర్థులకు వచ్చిన ఓట్లు కూడా కాంగ్రెస్ అభ్యర్ధి దక్కించుకోలేక పోవడం విశేషం. ఏదేమైనా.. అందరి అంచలనాలు తలకిందులు చేస్తూ.., ఈటల రాజేందర్ ఈ ఉప ఎన్నికలో విజయం సాధించి తన సత్తా చాటుకున్నారు. మరి.. ఈటల విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.