దేశ వ్యాప్తంగా ప్రజలు దసరా వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రసిద్ధ అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పట్టణాల నుంచి పల్లె వరకు ప్రతి చోట భక్తులు అమ్మవారి పూజాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వివిధ రూపాల్లో ప్రత్యక్షమైన అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. అదే సమయంలో తమ కొర్కెలు, కష్టాలు తీర్చమని దుర్గాదేవిని వేడుకుంటున్నారు. అయితే తన కష్టాలు తీర్చమని ఓ భక్తుడు మాత్రం అమ్మవారికి ఏకంగా లేఖ రాశాడు. భవానీ దేవిని కష్టాలు తీర్చమని కోరుకుంటూనే తన వ్యక్తిగత సమస్యను లేఖలో పొందుపర్చి అమ్మవారి విగ్రహం వద్ద ఉంచాడు. ఈ వింత ఘటన తెలంగాణ జిల్లా జిగిత్యాలలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ అజ్ఞాత భక్తుడు రాసిన లేఖ స్థానికంగా కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో సైతం ఆ భక్తుడు అమ్మవారికి రాసిన లేఖపైనే చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళ్తే..
తెలంగాణలోని జగిత్యాల పట్టణంలో ఉన్న మార్కండేయ ఆలయంలోని దుర్గ మాతకు దసరా సందర్భంగా నవరాత్రి వేడుకలు ఎంతో ఘనం జరుగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారికి తమ కష్టాలను చెప్పుకుని, తీర్చాలని వేడుకుంటున్నారు. అయితే ఓ అజ్ఞాత భక్తుడు తన కష్టాల గురించి అమ్మవారికి ఏకంగా లేఖ రాసి.. దానిని దుర్గమ్మ పాదాల వద్ద వదలి వెళ్లాడు. ఇది చూడటానికి కామెడీగా ఉన్న.. అందులో అతడి వేదన స్పష్టంగా కనిపిస్తోంది. ఈ లేఖ సారాంశం అంత డబ్బు చుట్టూనే తిరిగింది. అందులో ఒ వ్యక్తి పేరు పదే పదే ప్రస్తావించాడు ఆ అజ్ఞాత భక్తుడు. భవానీ దేవి విగ్రహం పాదాల దగ్గర వదిలిన వెళ్లిన లేఖలో అసలు ఏం ఉందంటే..”అమ్మా దుర్గమ్మ తల్లి… మేము మీ భక్తులం కష్టాలలో ఉన్నాము తల్లి. మమల్ని నువ్వే అదుకోవాలి అమ్మా” అంటూ లేఖలో పేర్కొన్నాడు. నరైన్ గాంధీ అనే వ్యక్తి కాలేజీ కోసమని తన దగ్గర డబ్బులు తీసుకున్నాడని లేఖలో భక్తుడు తెలిపాడు.
అయితే తన వద్ద డబ్బులు తీసుకున్న సదరు వ్యక్తి తిరిగి తన డబ్బులు ఇవ్వడం లేదని, కాలేజీ కోసం తీసుకున్న డబ్బులకు లాభాలు కూడా ఇస్తాని చెప్పాడని, అయితే లాభాల మాట దేవుడు ఎరుగు తాను ఇచ్చిన డబ్బులు కూడా ఇవ్వడం లేదని లేఖలో తెలపడం జరిగింది. అయితే అతడి నుంచి తన డబ్బులు ఇప్పించాలని అమ్మవారిని వేడుకున్నాడు. నరైన్ గాంధీ అనే వ్యక్తి .. డబ్బులు తిరిగి ఇస్తే అందులో నుంచి కొంత మొత్తం జగిత్యాలలో జరుగుతున్న గుడి నిర్మాణానికి సాయం చేస్తానని లేఖలో అమ్మవారి మాట ఇచ్చాడు. ప్రస్తుతం ఈ భక్తుడి లేఖ జగిత్యాల జిల్లాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.