దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని చోట్ల వీధి కుక్కల బెడద ఎక్కువవుతోంది. కుక్కల దాడుల్లో ఇటీవల హైదరాబాద్‌లో ఓ చిన్నారి మృతి చెందాడు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్ రంగంలోకి దిగుతోంది. ఈ సంస్థ ఏం చేయబోతోందంటే..!
తెలంగాణలో వీధి కుక్కలు అందర్నీ భయపెడుతున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లల తల్లిదండ్రులు కుక్కలంటే జంకుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్‌పై కుక్కలు దాడి చేయడం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు చనిపోయిన సంగతి విదితమే. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన మరువక ముందే సిటీలోని చైతన్యపురితో పాటు రాజన్న సిరిసిల్లలోనూ ఇలాంటి ఘటనలే చోటుచేసుకున్నాయి. ఇరు ఘటనల్లోనూ బాలలపై కుక్కలు అటాక్ చేశాయి. గాయాలపాలైన చిన్నారులను కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వాళ్లు చికిత్స పొందుతున్నారు. కాగా, వరుసగా జరుగుతున్న ఈ ఘటనలతో ప్రభుత్వం అప్రమత్తం అవుతోంది.
ఇప్పటికే జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ఉన్న కుక్కలను పట్టుకుని స్టెరిలైజేషన్ చేస్తున్నారు అధికారులు. ఇక, కుక్కల బెడద నివారణకు ప్రముఖ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ రంగంలోకి దిగింది. జంతు టీకాలు, మందుల కోసం బయోవెట్ను భారత్ బయోటెక్ గ్రూపు సంస్థ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సంస్థ రేబిస్ వ్యాధి వ్యాప్తిని నిరోధించేందుకు కుక్కలకు ఇచ్చే వ్యాక్సిన్‌ను డెవలప్ చేయడంపై పరిశోధనలు చేపట్టనుంది. ఈ విషయాన్ని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి.సాయిప్రసాద్ తెలిపారు.
హైదరాబాద్‌లో శుక్రవారం మొదలైన ‘బయో ఆసియా 2023’ చర్చాగోష్ఠిలో సాయిప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు. రేబిస్ వ్యాధి వ్యాప్తి నిరోధించేందుకు కుక్కలకు ఇచ్చే టీకాను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించామన్నారు. కుక్కకాటుతో రేబిస్ సోకి దేశంలో ప్రతి ఏడాది 25,000 మందికి పైగా చనిపోతున్నందున, సాధ్యమైనంత త్వరగా ఈ వ్యాక్సిన్‌ను తయారు చేస్తామని సాయిప్రసాద్ చెప్పారు. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న బయోవెట్ ఇప్పటికే ఈ ప్రాజెక్టును చేపట్టిందన్నారు. పెట్ డాగ్స్, స్ట్రే డాగ్స్ సహా వేటికైనా ఉపయోగించే టీకా దిశగా తమ రీసెర్చ్ సాగుతోందన్నారు. వచ్చే రెండేళ్లలో ఈ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించాలనేదే తమ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.