ప్రభుత్వ ఉద్యోగులు అంటే కేవలం ప్రజలపై అధికారం చెలాయించడమే కాదు.. ప్రజల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల పట్ల నమ్మకం కలిగించాలి. అలా ప్రజలతో మమేకమై వారి అవసరాలు తీర్చే అధికారులు ఎందరో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కొందరు తమ పిల్లలను పెద్ద పెద్ద కార్పొరేటు స్కూల్ లో చదివిస్తూ.. సమాజానికి మాత్రం ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ప్రజలు కృషి చేయాలని నీతులు వల్లిస్తారు. కానీ కొందరు అధికారులు మాత్రం తాము చేసి చూపించిన తరువాతే ప్రజలకు చెప్తారు. ప్రభుత్వ సంస్థలపై ప్రజలకు అలాంటి వారి మాటలతోనే నమ్మకం కలుగుతుంది. ఆ కోవకు చెందిన ఓ జిల్లా కలెక్టర్.. తన భార్యను సామాన్యుడిలా ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కోసం జాయిన్ చేశారు. ఆయనే భద్రాది కొత్తగూడెం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి.
వివరాల్లోకి వెళ్తే… భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ గా ప్రజలకు సేవలు అందిస్తున్నారు అనుదీప్. ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులపై జనానికి నమ్మకం కలిగించే పని చేశారు. కలెక్టర్ భార్యను ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అనుదీప్ భార్య మాధవి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కలెక్టర్ తలచుకుంటే పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేర్పించవచ్చు. కానీ సామాన్యుడిలా భద్రాచలం ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యం చేయించారు. ఓ కలెక్టర్ ఇలా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయిండం మిగిలిన వారికి ఆదర్శమని స్థానికులు అంటున్నారు. కలెక్టర్ స్థాయి వ్యక్తులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం పొందితే అక్కడ అందుతున్న సౌకర్యాలు మెరుగయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఆదర్శమైన పనిచేస్తున్న భద్రాది కొత్తగూడెం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.