'సార్.. మీకు క్రెడిట్ ఉందా..?' అని ప్రశ్న ఎదురవ్వగానే.. లేదని చెప్పి క్రెడిట్ కార్డు తీసేసుకుంటున్నారా..? అయితే ఇది చదివాక అలాంటి నిర్ణయం తీసుకోండి. లేదంటే భారీగా నష్టపోవాల్సి ఉంటుంది.
‘సార్.. మీకు క్రెడిట్ ఉందా..?’ నగరంలో ఏ మాల్‌కు వెళ్లినా.. ఏ పెట్రోల్ బంకుకు వెళ్లినా మొదట ఎదురయ్యేది ఈ ప్రశ్న. ‘సార్.. సార్.. మా బ్యాంకు క్రెడిట్ కార్డు తీసుకోండి.. బోలెడు లాభాలుంటాయి.. మీరు వార్షిక ఫీజు కూడా చెల్లించక్కర్లేదు.. ‘ఫ్రీ’గానే ఇస్తున్నాం అంటూ కస్టమర్లను కన్విన్స్ చేసి క్రెడిట్ కార్డు కట్టబెట్టడం అన్నది ఈరోజుల్లో కామన్. వినియోగదారులు కూడా ‘పడుతుంటదిలే.. అవసరముంటే వాడుకుందాం లేదంటే ఏం కాదుగా..’ అన్న ధీమాతో తీసుకుంటుంటారు. ఇక్కడివరకు అన్నీ సజావుగా ఉన్నా రోజులు గడిచేకొద్దీ ‘మీ ఖాతాలో డబ్బులు కట్టయ్యాయి..’ అని మెసేజులు వస్తుంటాయి. ఎందుకా..? అని ఆరా తీస్తే ఉచితంగా వచ్చిన క్రెడిట్ కార్డు వల్ల..
పోనీ ఇలా డబ్బులు కట్టాయ్యాయి అనడానికి ఓ అర్థమైంది. అత్యాశపడి తీసుకున్నాడు.. అనుభవించాలి అనుకుందాం.. కానీ ఓ వినియోగదారుడి విషయంలో ఇలా కూడా జరగలేదు. క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేయకున్నా సరే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్ కార్డు ఇష్యూ చేసింది. అంతేకాదు అతని అకౌంట్ నుంచి రూ.33,493ను కట్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అప్లై చేసింది. దీన్ని గుర్తించిన సదరు వినియోగదారుడు.. తనకు తెలియకుండా క్రెడిట్ కార్డు, ఆరోగ్య బీమా పాలసీలు ఎలా ఇస్తారని అడిగినా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది. దీంతో అతను వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించడంతో బ్యాంకుకు భారీ జరిమానా విధించింది.
వివరాల్లోకి వెళ్తే.. కోఠీలోని బ్యాంక్ స్ట్రీట్‌కు చెందిన వెంకటయ్య అనే వ్యక్తి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అప్పట్లో తన ఇంటికి హెచ్‌డీఎఫ్‌సీ ఎగ్జిక్యూటివ్ వచ్చి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని కోరారు. అందుకు అతడు నిరాకరించాడు. దీంతో సదరు సిబ్బందే అతని క్రెడిట్ కార్డు జిరాక్స్ తీసుకొని అతనికి తెలియకుండానే 2020లో హెల్త్ ఇన్సూరెన్స్ కి అప్లై చేశారు. అందుకు గాను అతని ఖాతా నుంచి రూ.1560 విత్‌డ్రా అయ్యాయి. దీంతో అతడు తనపేరిట ఉన్న క్రెడిట్ కార్డు క్లోజ్ చేశాడు. అయితే కొద్దిరోజుల్లోనే అతని ఇంటికి మరో కొత్త క్రెడిట్ కార్డు పంపించింది హెచ్‌డీఎఫ్‌సీ సంస్థ. పంపించడమే కాదు.. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పేరిట అతని ఖాతా నుంచి రూ.33,493 బదిలీ చేసింది.
ఈ విషయమై బాధితుడు సంబంధిత సంస్థకు ఫిర్యాదు చేయగా సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో అతడు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన వినియోగదారుల కమిషన్.. ఖాతాదారుడి అనుమతి లేకుండా అతని పేరిట కొత్త కార్డు మంజూరు చేసినందుకు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పేరిట అతని ఖాతా నుంచి రూ.33,493 విత్ డ్రా చేసినందుకు గానూ భారీ జరిమానా విధించింది. వినియోగదారుడికి 9శాతం వడ్డీతో కలిపి రూ.33,493 చెల్లించాలని తీర్పిచ్చింది. అలాగే రూ.10వేల జరిమానాతో పాటు కోర్టు ఖర్చుల కింద మరో 10వేలు చెల్లించాలని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ సంస్థను ఆదేశించింది. కావున క్రెడిట్ తీసుకునే ముందు అన్ని విషయాలు తెలుసుకొని.. అవసరమైతే మీరు సంతకాలు చేసిన పేపర్స్ ఫోటోలు తీసుకోవడం మంచింది. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.