పదో తరగతి పరీక్షా ప్రశ్నా పత్రం లీక్ వ్యవహారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి సంజయ్ కార్యకర్తలను ఉద్దేశిస్తూ ఓ లేఖ పంపించారు.
పదో తరగతి పరీక్షా ప్రశ్నా పత్రం లీక్ వ్యవహారంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా పోలీసులు ఆయనకు కరీంనగర్ జైలుకు తరలించారు. ఇదిలావుంటే బండి సంజయ్ జైలు నుంచి బీజేపీ కార్యకర్తలను ఉద్దేశిస్తూ ఓ లేఖ పంపించడం కలకలం రేపుతోంది. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీలో ప్రభుత్వ తప్పిదాలను ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్ కొడుకు పాత్రను ఎత్తిచూపినందుకే తనను అరెస్ట్ చేశారని బండి సంజయ్ ఆ లేఖలో ప్రస్తావించారు.
బీజేపీ 44వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బండి సంజయ్ జైలు నుంచే కార్యకర్తలకు లేఖ విడుదల చేశారు. తనకు జైళ్లు కొత్త కాదని, టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీలో ప్రభుత్వ తప్పిదాలను ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్ కొడుకు పాత్రను ఎత్తిచూపినందుకే తనను అరెస్ట్ చేశారని ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. కేసీఆర్ కొడుకును కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసే వరకు నిరుద్యోగులకు రూ. లక్ష పరిహారం ఇచ్చే వరకు కార్యకర్తలు పోరాడాలని ఆయన కోరారు. తనకు కేసులు, అరెస్టులు, కొత్త కాదని.. ప్రజల కోసం ఎన్నిసార్లైనా జైలుకు వెళ్లేందుకు సిద్ధమని వెల్లడించారు. తన బాధంతా నిరుద్యోగుల భవిష్యత్ గురించేనని రాసుకొచ్చారు. 30 లక్షల నిరుద్యోగుల జీవితాలతో, వాళ్ల కుటుంబాలతో కేసీఆర్ ప్రభుత్వం చెలగాటమాడుతోని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే కేసీఆర్ పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులు సహా సబ్బండి వర్గాలు అనేక కష్టాలను అనుభవిస్తున్నాయని.. వాళ్లందరికీ బీజేపీ ఆశా దీపమైందని తెలిపారు. వాళ్ల ఆశలను నెరవేర్చాలంటే పోరాటమే శరణ్యం అని లేఖలో సంజయ్ స్పష్టం చేశారు.
ఇదిలావుంటే బండి సంజయ్ కు బెయిల్ వస్తుందా..? రాదా? అన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. బెయిల్ పిటీషన్‌పై హనుమకొండ జిల్లా కోర్టులో ఏప్రిల్ 6వ తేదీ గురువారం మధ్యాహ్నం నుంచి తీవ్ర వాదనలు జరగగా.. తీర్పు వెలువడాల్సి ఉంది. బెయిల్ ఇవ్వాలని బండి తరపు లాయర్లు గట్టిగా వాదిస్తే.. బెయిల్ మంజూరు చేయొద్దని పోలీస్ కస్టడీకి ఇవ్వాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వాదించింది. నా జీవితంలో ఇలాంటి కేసు ఎన్నడూ చూడలేదని జడ్జి వ్యాఖ్యానించటం గమనార్హం. ఇరువర్గాల వాదనలు విన్న జిల్లా కోర్టు.. ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతుంది.