10వ తరగతి ప్రశ్నా పత్రం లీక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హస్తం ఉందని పోలీసులు భావించారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని మంగళవారం అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అరెస్ట్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 10వ తరగతి ప్రశ్నా పత్రం లీక్ కేసులో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అరెస్ట్ వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా ఉద్రిక్తతకు దారి తీసింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడ్ని కక్ష పూరితంగానే తప్పుడు కేసులో అరెస్ట్ చేశారంటూ మండిపడుతున్నారు. ఇక, పేపర్ లీక్ వ్యవహారం.. నాటకీయ పరిణామాల మధ్య బండి సంజయ్ అరెస్ట్.. ఆయనపై ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు? అన్న పూర్తి వివరాలు ఇవే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి హిందీ పరీక్ష జరిగింది. ఓ విద్యార్థి కమలాపూర్ నియోజకవర్గం ఉప్పల్‌లోని ప్రభుత్వ పాఠశాలలో పరీక్షలు రాస్తున్నాడు. పరీక్ష జరుగుతుండగానే అతడు ప్రశ్నా పత్రాన్ని బయటకు చేరవేశాడు. బండి సంజయ్ అనుచరుడైన బూరం ప్రశాంత్‌కు ఇచ్చాడు. ప్రశాంత్ ప్రశ్నా పత్రాన్ని ఫొటో తీశాడు. ఉదయం 10:46 గంటల ప్రాంతంలో కొన్ని వాట్సాప్ గ్రూపులకు ఆ ఫొటోలను షేర్ చేశాడు. ఆ వెంటనే పేపర్ లీక్ అయ్యిందంటూ స్వయంగా బ్రేకింగ్ న్యూస్ అంటూ వార్త రాశాడు. ఆ వార్తను వరంగల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేశాడు. అంతటితో ఆగకుండా.. హైదరాబాద్‌లోని పలువురు బ్యూరో ఇన్‌చార్జిలకు కూడా బ్రేకింగ్ న్యూస్ అంటూ పంపించాడు.
పేపర్ లీకేజ్ వ్యవహారంలో నిందితుడైన ప్రశాంత్‌తో బండి సంజయ్ గత కొంత కాలంగా టచ్‌లో ఉన్నట్లు పోలీసులు తేల్చారు. సోమవారం సాయంత్రం 5.30 నుంచి మంగళవారం ఉదయం వరకు ప్రశాంత్‌తో సంజయ్ పది సార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. అది కూడా వాట్సాప్ కాల్‌లో మాట్లాడినట్లు పేర్కొన్నారు. పేపర్ లీక్‌కు ముందు రోజు ఇద్దరూ చాట్ చేసుకున్నట్లు కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే పదో తరగతి హిందీ ప్రశ్నా పత్రం లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ హస్తం ఉందని పోలీసులు భావించారు. ఆయన్ని అరెస్ట్ చేయటానికి రంగం సిద్ధం చేశారు. మంగళవారం అర్థరాత్రి బండి సంజయ్ ఇంటికి హుటాహుటిన వెళ్లారు.
మంగళవారం అర్థరాత్రి దాదాపు 50 మందికి పైగా పోలీసులు బండి సంజయ్ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లి అరెస్ట్ చేయబోతున్నట్లు తెలిపారు. దీంతో బండి సంజయ్ వారితో వాగ్వివాదానికి దిగారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులతో గొడవ పెట్టుకున్నారు. అయినప్పటికి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. వాహనంలో ఎక్కించుకుని అక్కడినుంచి తరలించారు. ఆయన్ని భువనగిరి జిల్లా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడకు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళనకు దిగటంతో ఉద్రిక్తత నెలకొంది. సాయంత్రం బండి సంజయ్‌ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. పోలీసులు బండి సంజయ్ ఫోన్ కాల్, చాటింగ్ వివరాలను సేకరిస్తున్నారు.
బండి సంజయ్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 10వ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ, ఆ తర్వాత జరిగిన ప్రచారాల్లో బండి సంజయ్ హస్తం ఉందని భావించిన పోలీసులు.. వాటి ఆధారంగానే బండి సంజయ్‌పై మొత్తం 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 420, 120B, సెక్షన్ 5 ఆఫ్ మాల్‌ప్రాక్టీస్, సీఆర్‌పీసీ 154, 157 సెక్షన్ల కింద.. ఆయన మీద కేసులు నమోదు చేశారు. అంతేకాదు.. బెయిల్ తీసుకునే అవకాశం లేని విధంగా.. చాలా పకడ్బందీగా నాన్‌బెయిలబుల్ కేసులు సైతం నమోదు చేశారు. మరి, బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.