తెలుగు వారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిన మహానటుడు, టీడీపీ వ్యవస్థాపకులు సీనియర్ ఎన్టీఆర్. నటుడిగా ఇండస్ట్రీలో ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నారు.. రాజకీయాల్లో అదేస్థాయిలో తనదైన ముద్ర వేశారు. ఆయన తనయుడు బాలకృష్ణ సినీ, రాజకీయాల్లో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు.
విశ్వ విఖ్యాత నటసార్వభౌములు, టీడీపీ వ్యవస్థాపకులు.. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిల్చిపోయిన ఆదర్శప్రాయుడు నందమూరి తారకరామారావు.. అందరూ ఆయనను ఎన్టీఆర్ అంటారు. నటుడిగానే కాకుండా రాజకీయాల్లో తనదైన ముద్రవేసి అందరిచే అన్నా అని పిలిపించుకున్న గొప్ప వ్యక్తి ఎన్టీఆర్. ఇండస్ట్రీలోనే కాదు.. రాజకీయాల్లో సైతం ఆయనను ఎంతోమంది ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగారు. సికింద్రాబాద్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉవ్సవాల సందర్భంగా ఎన్టీఆర్ తనయుడు హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సికింద్రాబాద్ లోని ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.. ఈ వేడుకలకు ఎన్టీఆర్ తనయుడు హిందూపూర్ ఎమ్మెల్యే నందమూని బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా సీనియర్ ఎన్టీఆర్ ని ఏదో ఒక సందర్భంలో గుర్తు చేసుకుంటారు.. ఆయన తెలుగు వాడి ఆత్మ గౌరవం.. ఎంతో మందికి ఆదర్శం.. ప్రపంచంలోనే ఆయన ఓ గొప్ప వ్యక్తిగా కీర్తింపబడ్డారు. ఆయన ఓ కారణ జన్ముడు.. నా గురువు, దైవం అన్నీ ఆయనే అంటూ పేర్కొన్నారు. సినీ ప్రపంచంలో ఆయన ఒక ధృవతార.. రాజకీయ చరిత్రలో ఆయన పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ ఉత్సవాలకు నేను అతిథిని కాదు.. నేనూ ఓ కార్యకర్తనే.. టీడీపీ మనందరి పార్టీ అన్నారు.
తెలంగాణ ప్రజల గుండెల్లో టీడీపీకి ఓ సుస్థిర స్థానం ఉంది.. ఇక్కడ టీడీపీకి పూర్వ వైభవం తీసుకు వచ్చే బాధ్యత మనపై ఉంది. ఇందుకోసం ప్రతిఒక్క టీడీపీ కార్యకర్త కృషి చేయాలి.. దాని కోసం నేను సైతం మీతోనే ఉంటా.. తెలంగాణలోనూ టీడీపీ ఉంటుంది.. రాబోయే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపించాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇకపై తెలంగాణ ప్రజలకు నేను ఎప్పటికీ అందుబాటులో ఉంటా.. అండదండగా ఉంటా అన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఇప్పటికీ ఆయన పథకాలనే ఫాలో అవుతున్నాయి కొన్ని పార్టీలు. దేశంలో తొలిసారి పేద ప్రజలకు పక్కా ఇళ్లు ఇచ్చారు. జోగిని వ్యవస్థను రద్దు చేశారు.. ట్యాంక్ బండ్ పై మహనీయుల విగ్రహాలు పెట్టింది ఎన్టీఆర్ అన్న విషయం గుర్తుంచుకోవాలి అన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కి భారత రత్న పురస్కారం గురించి ప్రస్తావిస్తూ.. దేశ రాజకీయాల్లో పెను మార్పులు తెచ్చిన ఆ మహానుభావుడికి దేశం తగిన గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు.