దేశంలో ఇటీవల కరోనా మరణాలు భయాందోళన సృష్టిస్తే.. ఇప్పుడు గుండెపోటు మరణాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ వరుస గుండెపోటు మరణాలు కలవరం సృష్టిస్తున్నాయి. కారణాలు ఏవైనా కావొచ్చు.. చిన్నపెద్దా అనే తేడా లేకుండా ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు.
దేశంలో ఇప్పుడు గుండెపోటు పేరు వినిపిస్తే చాటు భయంతో వణికిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో కన్నుమూస్తున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు అకస్మాత్తుగా కళ్లముందే కుప్పకూలిపోతున్నారు. హాస్పిటల్ కి తరలించేలోపు దారిలో కొందరు.. చికిత్స పొందుతూ మరికొంతమంది చనిపోతున్నారు. కొన్నిసార్లు గుండెపోటుకి గురైన వారికి సీపీఆర్ చేసి రక్షించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆటో డ్రైవింగ్ చేస్తుండగా యువకుడు హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
సిద్దిపేట జిల్లా కొండపాక నుంచి కుక్కునూరుపల్లికి ఓ యువకుడు ఆటో నడుపుతూ వెళ్తున్నాడు.. అకస్మాత్తుగా మార్గమద్యలోనే ఆటో ఆపి కిందపడిపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు 108 కి ఫోన్ చేయడంతో హుటాహుటిన 108 అంబులెన్స్ అక్కడికి చేరుకుంది. గుండెపోటుతో యువకుడు ఇబ్బంది పడుతున్నట్లు గమనించి వెంటనే సీపీఆర్ చేశారు. కొద్దిసేపటి తర్వాత ఆ యువకుడు శ్వాస పీల్చుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఆటో డ్రైవర్ పేరు పర్వతం రాజు, వయసు 28 సంవత్సరాలు అని గుర్తించారు. అనంతరం రాజు ని గజ్వేల్ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించారు.
గత కొంతకాలంగా వరుస గుండెపోటు మరణాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా హఠాత్తుగా గుండెపోటుతో చనిపోతున్నారు. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా కనిపించిన వారు సైతం ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటుతో అత్యధికంగా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ పరిణామాల పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తుంది.