వీధి కుక్కల స్వైర విహారం నగరాల్లో ఆగడం లేదు. అంబర్ పేటలో నాలుగేళ్ల చిన్నారిపై దాడి చేసిన వీధి కుక్కలు.. అతడి మృతికి కారణమయ్యాయి. ఈ ఘటన మర్చిపోక ముందే హైదరాబాద్ నగరంలో మరో ఘటన చోటుచేసుకుంది. దీంతో వీధికుక్కలపై అధికారుల చర్యలపై విమర్శలు వస్తున్నాయి.
హైదరాబాద్ లో వీధికుక్కలు స్వైర విహారం చేస్తూనే ఉన్నాయి. మనుషులపై దాడికి పాల్పడుతూనే ఉన్నాయి. అంబర్ పేటలో వీధి కుక్కల దాడి ఘటనలో ప్రదీప్ అనే నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన ఎంతటి సంచలనం కలిగించిందో అందరికి తెలుసు. ఈ దాడి తర్వాత వీధి కుక్కలపై చర్యలు తీసుకుంటామన్న జీజీహెచ్ఎం కొంత హడావుడి కూడా చేసింది. కుక్కల్ని పట్టుకునే ఓ బృందం రంగంలోకి దిగి, వాటికి స్టెరిలైజ్ చేసి విడిచి పెట్టింది. తాజాగా నాచారంలో ఆశ్రిత్ అనే చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి.తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు ఆ చిన్నారి. అయితే ఈ క్రమంలో అతడికి గాయాలయ్యాయి. ఈ ఘటనతోమరో సారి అధికారుల చర్యలు తూతూ మంత్రంగా ఉన్నాయని విమర్శలు మొదలయ్యాయి.
వివరాల్లోకి వెళితే నాచారంలోని మల్లాపూర్ లో కిశోర్ కుటుంబం నివసిస్తోంది. వారికి ఇద్దరు పిల్లలు. అక్కా, తమ్ముడు ఇంటి గేటు వద్ద ఆడుకుంటుండగా ఆశ్రిత్ బొమ్మ బయటపడిపోయింది. దాన్ని తీసుకునేందుకు బయటకు రాగా, ఒక్కసారిగా ఆశ్రిత్‌పై కుక్కలు దాడి చేశాయి. వెంటనే తేరుకున్న ఆశ్రిత్ ఇంట్లోకి పరిగెడుతూ పడిపోయాడు. అంతలో సమయ స్ఫూర్తిగా వ్యవహరించిన అతడి అక్క తన చేతిలో ఉన్న వస్తువు వాటిపై విసిరేయడంతో అవి అక్కడ నుండి పారిపోయాయి. అయితే ఈ ఘటనలో బాలుడికి గాయాలయ్యాయి. నడక లేని పరిస్థితిలో మోకాళ్ల దగ్గర దెబ్బలు తగిలాయి. ఈ ఘటనపై బాధితుడు తల్లిదండ్రులు స్పందించారు.
తమ కాలనీలో సుమారు 20 కుక్కలు ఉన్నాయని, తమపై దాడి చేస్తుందని జీజీహెచ్ఎంకు ఫిర్యాదు చేశామని, స్పందిస్తున్నారు కానీ, వాటిని తీసుకెళ్లి స్టెరిలైజ్ చేసి ఇక్కడే విడిచి పెడుతున్నారంటూ తండ్రి కిశోర్ వాపోయారు. ఎందుకు ఇలా విడిచిపెడుతున్నారని అడిగితే హైకోర్టు ఆదేశాల ప్రకారం చేస్తున్నామంటూ చెబుతున్నారన్నారు. ప్రదీప్ ఘటన జరిగిన గురించి తాము చర్చిస్తున్న సమయంలోనే తమ కుమారుడిపై ఈ తరహా దాడి జరిగిందన్నారు. దీని వల్ల తన కుమారుడు సైకాలజికల్‌గా ప్రాబ్లమ్‌ను ఎదుర్కొంటున్నాడని అన్నారు. తల్లి తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. జంతు ప్రేమికులపై కూడా కిశోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరిపోవని, ఇంకా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.