కృష్ణా నదిలో వాటర్ డెడ్ స్టోరేజీకి చేరింది. దీంతో వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం జూరాల గ్రామ సమీపంలో కృష్ణా నదిలో పురాతన రాతి విగ్రహాలు బయటపడ్డాయి. మత్స్యకారులు వేటకు వెళ్లిన సమయంలో ఈ రాతి విగ్రహాలను గుర్తించారు. విగ్రహాలతో పాటు పూజా సామాగ్రి, కుండలు కూడా ప్రవాహంలో కొట్టుకొచ్చాయి. నీటి ప్రవాహంలో ఒడ్డుకు వచ్చిన దేవతా మూర్తుల విగ్రహాలు చెక్కు చెదరకపోవడం గమనార్హం.
నదీ ప్రవాహానికి ఇసుక సహా చిన్న చిన్న రాళ్లు కొట్టుకురావడం సహజం. అయితే, ఇక్కడ మాత్రం పెద్ద పెద్ద దేవతామూర్తుల విగ్రహాలు కొట్టుకు వచ్చాయి. ఎలా వచ్చాయో.. ఎక్కడి నుంచి కొట్టుకు వచ్చాయో తెలియదు గానీ.. అకస్మాత్తుగా నదీ ఒడ్డున ఆంజనేయ సమేత సీతారామ లక్షణుల విగ్రహాలు దర్శనమిచ్చాయి. అత్యంత పురాతనమైనవిగా కనిపిస్తున్న ఈ విగ్రహాల పక్కనే నీటిలోనే చెల్లాచెదురుగా కుండలు, ఇతర పూజా సామాగ్రి ఉన్నాయి. ఇక్కడ మరో విచిత్రమేంటంటే.. కొట్టుకొచ్చిన సీతారామ లక్ష్మణుల విగ్రహాల సమీపానికే విడిగా ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం కొట్టుకురావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందులోనూ విగ్రహాలకు ఆభరణాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విగ్రహాలను పురావస్తు శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Eco Bridge: దేశంలోనే మొదటి సారి.. తెలంగాణలో పులుల కోసం ఓ వంతెన