గురువారం జమ్మూకాశ్మీర్ లో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో తెలంగాణ వాసి అనిల్ అనే ఆర్మీ జవాన్ మరణించిన విషయం తెలిసిందే. అతని మరణ వార్త తెలుసుకున్న భార్య సౌజన్య గుండెలు పగిలేలా ఏడ్చింది.
జమ్మూకాశ్మీర్ లో హెలికాప్టర్ నదిలో కుప్పకూలిన ప్రమాదంలో తెలంగాణ వాసి అనిల్ అనే ఆర్మీ జవాన్ మరణించిన విషయం తెలిసిందే. ఇతని మరణ వార్తతో తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు కడసారి చూపు కోసం తరలివచ్చారు. ఇక అనిల్ అంతిమ యాత్రలో స్థానిక నాయకులు, చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు చాలా మంది పాల్గొని కన్నీరు మున్నీరుగా విలపించారు.ఇక అనిల్ మృతదేహాన్ని స్వగ్రామం తీసుకురాగానే స్థానిక యువకులు జాతీయ జెండాలతో స్వాగతం పలికి అతని ఇంటికి ర్యాలీగా తీసుకెళ్లారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన పబ్బాల అనిల్ అనే యువకుడు గత 11 ఏళ్లుగా ఆర్మీ జవాన్ గా పని చేస్తున్నాడు. ఇతనికి గతంలో సౌజన్య అనే అమ్మాయితో వివాహం జరిగింది. కొంత కాలానికి ఇద్దరు కుమారులు జన్మించారు. అనిల్ అప్పుడప్పుడు ఇంటికి వస్తూ పోతుండేవాడు. ఇదిలా ఉంటే.. గురువారం జమ్ముకశ్మీర్ లోని కిశ్త్ వాఝ్ సమీపంలో ఓ ఆర్మీ హెలికాప్టర్ సిగ్నల్ కారణంగా నదిలో కుప్పకూలిన విషయం తెలిసిందే. అయితే అందులో అనిల్ తో పాటు మరో ఇద్దరు జవాన్ లు ప్రయాణించారు. ఈ ప్రమాదంలో అనిల్ చనిపోగా, మిగతా ఇద్దరు జవాన్ లు తీవ్ర గాయాల పాలయ్యారు. అనిల్ మరణవార్త తెలుసుకున్న అతని భార్య, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఆర్మీ అధికారులు అనిల్ మృతదేహాన్ని శనివారం తన స్వగ్రామం అయిన మల్కాపూర్ కు తీసుకొచ్చారు. అక్కడికి చేరుకోగానే స్థానిక యువకులు జాతీయ జెండాలతో స్వాగతం పలికారు. ఇక అనిల్ ను కడసారి చూసేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులు,ప్రజలు తండోపతండాలుగా కదలివచ్చారు. ఇక అంత్యక్రియలను అధికారులు సైనిక లాంఛనాల మధ్య నిర్వహించారు. అయితే అతని భార్య సౌజన్య .. భర్త రాడు, ఇక కనిపించడని తెలుసుకుని గుండెలు పగిలేలా ఏడ్చింది. ఆమె ఏడుస్తున్న తీరును చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు. అనిల్ భార్య భర్తను చూసి చివరగా సెల్యూట్ చేయడం విశేషం. ఈ దృశ్యాన్నిచూసి సైనిక అధికారులు సైతం శోక సంద్రంలో మునిగిపోయారు. మొత్తానికి అనిల్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో ముగిశాయి.అనిల్ మృతిపట్ల మంత్రి కేటీఆర్ సైతం స్పందించి సంతానం తెలిపారు.