Ambulance: ఈ గజిబిజి ట్రాఫిక్ పట్టణంలో ఎంత తక్కువ దూరం పోదామన్న చాలా టైం పడుతుంది. పది నిమిషాలు అనుకున్న ప్రయాణం అర్థగంట, గంట కూడా పడుతుంది. చాలా దారుల్లో అంబులెన్స్‌లకు సైతం వెళ్లడానికి వీలులేని పరిస్థితి ఉంటుంది. ఆ టైంలో అంబులెన్స్ లోపల ఉన్న వారిపై జాలి కలుగుతుంది. వారు ఏ అవస్థలో ఉన్నారో తల్చుకుంటే పాపం అనిపిస్తుంది. అరె! ఈ ట్రాఫిక్‌లో అంబులెన్స్‌కు కూడా దారి దొరకటం లేదే.. అందరూ పక్కకు జరిగి దారిస్తే బాగుణ్ణు అనిపిస్తుంది. ట్రాఫిక్ మీద విపరీతమైన కోపం వస్తుంది. హైదరాబాద్ ట్రాఫిక్ అలాంటిది మరి. ఇలాంటి ట్రాఫిక్‌లో ఓ అంబులెన్స్ ఎఫ్ 1 రేస్‌లో పరుగులు తీసినట్లు తీస్తే ఎలా ఉంటుంది.
నమ్మటానికే ఆశ్చర్యంగా ఉంది కదూ.. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా, చోటుచేసుకుంది. ఓ అంబులెన్స్ శంషాబాద్ ఏయిర్‌పోర్టునుంచి కిమ్స్ ఆసుపత్రికి 11 నిమిషాల్లోనే వచ్చింది. లైవ్ ఆర్గాన్స్‌ను తీసుకువస్తున్న అంబులెన్స్ ఈ ఘనతను సాధించింది. ఓ రోగికి అవసరం అవటంతో పూణెనుంచి ఊపిరితిత్తులను హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టకు తీసుకువచ్చారు. అక్కడినుంచి కిమ్స్‌కు రోడ్డు మార్గం ద్వారా తరలించటానికి ట్రాఫిక్ పోలీసుల సహకారం తీసుకున్నారు. ఆ అంబులెన్స్ దాదాపు 36 కిలోమీటర్ల దూరాన్ని అతి తక్కువ సమయంలో చేరుకుంది.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఆ అంబులెన్స్ డ్రైవర్‌ను ఎఫ్ 1 రేసర్‌తో పోలుస్తున్నారు. ఓ వ్యక్తి ప్రాణాలు నిలపటానికి సహకారం అందించిన ట్రాఫిక్ పోలీసులకు సలామ్ చేస్తున్నారు. పీఎం,సీఎం, మంత్రుల కోసమే కాకుండా సాధారణ ప్రజల ప్రాణాలు కాపాడటానికి కూడా ట్రాఫిక్‌ను ఆపటాన్ని జనం ప్రశంసిస్తున్నారు. కాగా, ఇలా లైవ్ ఆర్గాన్స్ వేగంగా ఆసుపత్రికి చేర్చటం కొత్త సంఘటనేమీ కాదు. గతంలోనూ చాలా జరిగాయి. ట్రాఫిక్ పోలీసుల సహకారంతో లైవ్ ఆర్గాన్స్‌ను ఆసుపత్రులకు తరలించారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : పోలీసు ఉద్యోగాలకు వయో పరిమితిపెంపు.. KTR కి కృతజ్ఞతలు తెలిపిన T SAT సీఈఓ శైలేష్‌రెడ్డి!