విషాదం చోటు చేసుకుంది. అంబులెన్స్ లో పేలుడు సంభవించింది. దీంతో మంటలు చెలరేగి క్షణాల్లో అంబులెన్స్ దగ్ధమైంది. ఈ ఘటనలో అంబులెన్స్ డ్రైవర్ మృతి చెందారు.
ఎవరికైనా ఆపదొస్తే నిమిషాల్లో అంబులెన్స్ వచ్చి వాలుతుంది. ఈ విషయంలో అంబులెన్స్ డ్రైవర్లు చాలా అలర్ట్ గా ఉంటారు. ఏ రోడ్డు ప్రమాదమో జరిగితే అంబులెన్స్ వచ్చి తీసుకెళ్తుంది. అలాంటి అంబులెన్సే రోడ్డు ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి బోల్తా పడడంతో పేలుడు సంభవించి అంబులెన్స్ పూర్తిగా కాలిపోయింది. ఈ విషాద ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో హస్తినాపురం వద్ద ఓ ప్రైవేట్ అంబులెన్స్ లో పేలుడు సంభవించింది. దీంతో అంబులెన్స్ మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్ కి తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందారు.
మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మలక్ పేట్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చెందిన అంబులెన్స్.. బీఎన్ రెడ్డి హస్తినాపురం వద్ద డివైడర్ ను ఢీ కొట్టడంతో అదుపు తప్పి బోల్తా పడింది. వర్షాల కారణంగా రోడ్లు చిత్తడిగా మారడంతో హై స్పీడ్ లో వస్తున్న అంబులెన్స్ డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. అయితే అంబులెన్స్ లో ఆక్సిజన్ సిలిండర్ రాపిడికి ఇంధన ట్యాంక్ నుంచి మంటలు అంటుకోవడంతో క్షణాల్లో అంబులెన్స్ కాలిపోయింది.
అది గమనించిన స్థానికులు డ్రైవర్ ను అంబులెన్స్ లోంచి బయటకు తీశారు. అయితే దురదృష్టవశాత్తు తీవ్ర గాయాల కారణంగా అప్పటికే అతను మృతి చెందారు. అదే సమయంలో అంబులెన్స్ ని తొలగించే క్రమంలో అందులో ఉన్న ఆక్సిజన్ సిలిండర్ పేలింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అంబులెన్స్ పూర్తిగా కాలిపోయింది. అయితే అదృష్టం కొద్దీ ఒక పేషెంట్ ని అప్పుడే అంబులెన్స్ డ్రైవర్ తన ఇంటి వద్ద దించేసి వచ్చాడు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పేషెంట్ ని ఇబ్రహీంపట్నంలో దించేసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.