అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందిన సంఘటన ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ముక్కపచ్చలారని చిన్నారి.. కుక్కల దాడిలో దారుణంగా గాయపడి ప్రాణాలు వదలడం అత్యంత విషాదకరం. ఈ క్రమంలో చిన్నారికి సంబంధించిన పాత ఫోటోలు, వీడియోలు వైరలవుతున్నాయి. ఆ వివరాలు..
హైదరాబాద్ అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్ మృతి చెందని సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. చిన్నారి మృతి నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వీధి కుక్కల వల్ల ఇబ్బంది పడుతున్నట్లు తాము ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా.. జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు తెలుపుతున్నారు. ఇంకెంత మంది ప్రాణాలు పోతే.. మీరు స్పందిస్తారు అంటూ జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సామాన్యులతో పాటు రాజకీయా నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం చాలా విచారకరమన్నారు. చనిపోయిన బాలుడిని తీసుకురాలేం కానీ.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని.. వీధి కుక్కలను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు.
ఇక ప్రదీప్ మృతి నేపథ్యంలో చిన్నారికి సంబంధించిన పాత ఫోటోలు, వీడియోలు వైరలువుతన్నాయి. తల్లిదండ్రులతో కలిసి ఆడుకుంటూ.. నాన్నతో కలిసి బైక్ మీద వెళ్తూ ఎంజాయ్ చేస్తున్న చిన్నారి ఫోటోలు, వీడియోలు చూసి ప్రతి ఒక్కరు కంట తడి పెడుతున్నారు. బోసి నవ్వులతో.. బుడి బుడి నడకలతో.. అల్లరి చేస్తూ.. ఇంట్లో సందడి చేసిన ఆ చిన్నారి గొంతు మూగపోయింది అంటే మేమే నమ్మలేకపోతున్నాము. ఇక ఆ తల్లిదండ్రులు అనుభవిస్తున్న గుండె కోతను వర్ణించడం, వారిని ఓదార్చడం ఎవరి తరం కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బర్త్ డే వేడుకలో సందడి చేస్తూ.. చిన్న కృష్టుడి గెటప్‌లో ముద్దుగా ఉన్న ప్రదీప్ పాత ఫోటోలు ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి.
ప్రదీప్ తండ్రి నిజామాబాద్ జిల్లా ఇందల్వాయికి చెందిన గంగాధర్ ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. అంబర్‌పేటలోని ఓ కార్ సర్వీసింగ్ సెంటర్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. గంగాధర్‌కు ఆరేళ్ల కుమార్తె, నాలుగేళ్ల ప్రదీప్ సంతానం ఉన్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 19 ఆదివారం రోజున పిల్లలిద్దరికి సెలవు కావడంతో.. గంగాధర్ పిల్లలను తాను పనిచేస్తున్న చోటుకు తీసుకెళ్లాడు. ఇద్దరు పిల్లలు అక్కడే చాలా సేపు ఆడుకున్నారు. మధ్యాహ్నం భోజనం కూడా చేశారు.
ఇంతలో ప్రదీప్ బయటకు వచ్చాడు. బాలుడు ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు. మరి ఎక్కడ నుంచి వచ్చాయో తెలియదు.. నాలుగు వీధి కుక్కలు అక్కడకి వచ్చి ప్రదీప్‌ను చుట్టుముట్టాయి. బాలుడు భయంతో పరిగెత్తడంతో.. కుక్కలు అతడి వెంట పడి దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నారి ప్రదీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరి ఈ విషాదకర సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.