కుక్కలంటే విశ్వాసానికి ప్రతీక.. ఒక్కసారి వాటిని దగ్గరకు తీసుకుంటే చాలు.. జీవితాంతం మన పట్ల విశ్వాసం చూపుతాయి. అయితే నేడు పరిస్థితులు మారిపోయాయి. వీధి కుక్కల దాడిలో చిన్నారులు తీవ్రంగా గాయపడటం, ప్రాణాలు కోల్పవడం వంటి సంఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా అంబర్‌పేటలో ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది. దీనిపై నెటిజనులు ఏమంటున్నారంటే..
హైదారబాద్, అంబర్‌పేటలో దారుణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ముక్కుపచ్చలారని నాలుగేళ్ల పిల్లాడిపై వీధి కుక్కలు అత్యంత దారుణంగా దాడి చేసి.. చంపేశాయి. కార్ పార్కింగ్ ఏరియాలో ఆడుకుంటున్న చిన్నారిపై కుక్కలు ఒక్కసారిగా దాడికి దిగాయి. నాలుగువైపులా నాలుగు కుక్కులు దాడి చేస్తుంటే.. ఎలా తప్పించుకోవాలో.. ఎటు వెళ్లాలో అర్థం కాక ఆ పసివాడు భయంతో పరుగులు తీశాడు. కానీ విచక్షణ లేని ఆ జీవులు.. చిన్నారిపై దాడి చేశాయి. దొరికిన చోటల్లా కరుస్తూ.. పసివాడికి నరకం చూపాయి. బాలుడి ఒంటి మీద 32 చోట్ల గాయాలున్నాయి అంటే.. ఆ చిన్నారిపై కుక్కలు ఎంత దారుణంగా దాడి చేశాయో అర్థం చేసుకోవచ్చు. పాపం ఆ ధాటికి తాళలేక పసివాడు మృతి చెందాడు.
ఈ సంఘటన నగరంలో కలకలం రేపుతోంది. నాలుగేళ్ల చిన్నారిపై వీధికుక్కలు ఇంత పాశవికంగా దాడి చేయడం.. బాలుడు మృతి చెందడం ప్రతి ఒక్కరిని కలచి వేస్తోంది. ఇళ్లల్లో చిన్నారులు ఉన్న తల్లిదండ్రులు భయంతో ఒణికిపోతున్నారు. ఎందుకంటే నగరంలో ఏ వీధిలో చూసినా సరే.. వీధి కుక్కలు కనిపిస్తాయి. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగి తిరుగుతూ.. కొన్ని సందర్భాల్లో రోడ్ల మీద వెళ్లే వారి మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి. కాస్త పెద్ద పిల్లలు, పెద్దవాళ్లు అయితే.. వాటిని అదిలించి భయపెతారు. కానీ చిన్నారులు, వృద్ధుల విషయానికి వస్తే.. ఇదిగో ఇలాంటి భయంకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
ఇక చిన్నారి ప్రదీప్ మృతి నేపథ్యంలో నగరంలో వీధి కుక్కల స్వైర విహారంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ ఘటనలో చాలా మంది నెటిజనులు చిన్నారి తల్లిదండ్రులను తప్పు పడుతున్నారు. అంత చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించారు అంటూ విమర్శిస్తున్నారు. ఇక మరికొందరు జీహెచ్‌ఎంసీ అధికారులు, మేయర్ తీరును తప్పుపడుతున్నారు. ఏటా జీహెచ్‌ఎంసీ ఖాతాలో వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.. ఆచరణలో మాత్రం అవి ఎక్కడ ఖర్చు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇంకెంత మంది ప్రాణాలు పోతే మీరు స్పందిస్తారు అంటూ విమర్శిస్తున్నారు.
ఇక మరికొందరు నెటిజనులు మాత్రం.. కొందరు స్టార్లను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు. వీరిలో టాలీవుడ్‌లో పెద్ద కుటుంబానికి చెందిన ఓ సీనియర్ హీరోయిన్, టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా రాణిస్తున్న ఓ నటి, ఇతర ప్రముఖులను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు నెటిజనులు. వీరంతా వీధి కుక్కలకు ఏ చిన్న హానీ జరిగినా.. వాటిని బంధించినా.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసినా సరే.. వెంటనే సోషల్ మీడియా వేదికగా గగ్గోలు పెడతారు. వీధి కుక్కలను ప్రేమించాలి.. వాటికి ఆహారం, నీరు ఏర్పాటు చేయాలి అంటూ ఫ్యాన్స్‌కు హిత బోధ చేస్తారు. మరి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నప్పుడు ఎందుకు స్పందించరు.. వీటికి ఎవరిని బాధ్యులను చేయాలి.. ఇప్పుడు ఆ చిన్నారి ప్రాణాన్ని ఎవరు తీసుకువస్తారు.. ఆ తల్లిదండ్రుల గుండె కోతను ఎవరు తీరుస్తారు అంటూ సెలబ్రిటీలను ప్రశ్నిస్తున్నారు నెటిజనులు. మరి ఈఘటనపై సెలబ్రిటీలు ఎలా స్పందిస్తారో చూడాలి. మరి ఈ విషాదకర సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.