రామ్ గోపాల్ వర్మ అనగానే వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. తరచు ఏదో వివాదంలో ఉండటం వర్మ స్టైల్. అయితే నిత్యం వివాదాల్లో నిలిచే వర్మ తొలిసారి ఓ సామాజిక అంశంపై సానుకూలంగా స్పందించాడు. అంబర్‌పేట వీధి కుక్కల ఘటనలో చిన్నారిని కోల్పోయిన కుటుంబానికి వర్మ అండగా నిలిచాడు. వారికి న్యాయం చేయడం కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆ వివరాలు..
రామ్ గోపాల్ వర్మ.. ఒకానొక సమయంలో దేశం గర్వించదగిన దర్శకుడిగా వెలుగొందాడు. సౌత్ నుంచి బాలీవుడ్‌కి వెళ్లి.. అక్కడ సూపర్ సక్సెస్ సాధించాడు. ఒకప్పుడు బాలీవుడ్‌ని ఏలాడు వర్మ. ఆయన చిత్రాల్లో నటించేందుకు స్టార్ హీరోలు సైతం ఆసక్తిగా ఎదురు చూసేవారు. వర్మ డైరెక్షన్‌లో ఒక్క సినిమాలో అయిన యాక్ట్ చేయాలని కోరుకునేవారు. ఇటు వ్యక్తిగత జీవితంలోనూ వర్మ స్టైలే వేరు. ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలు కొట్టినట్లుగా ముక్కుసూటిగా మాట్లాడటం వర్మ నైజం. నా జీవితం నా ఇష్టం అన్నట్లు జీవించేస్తాడు వర్మ. అయితే గత కొంత కాలంగా వర్మ తీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా అషు రెడ్డితో ఇంటర్వ్యూ సందర్భంగా వర్మ వేసిన వేషాలు చూసి జనాలు ఆయన మీద ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. మేం చూస్తుంది ఒకప్పటి వర్మనేనా.. ఆ వర్మ చచ్చిపోయాడు అంటూ పెద్ద ఎత్తున విమర్శించారు.
గత కొంత కాలంగా వివాదాలతోనే వార్తల్లో నిలుస్తున్న వర్మ.. తాజాగా అంబర్‌పేట వీధి కుక్కల దాడి ఘటనపై తీవ్రంగా స్పందించాడు. ఈ సంఘటన చోటు చేసుకున్న నాటి నుంచి బాధిత బాలుడి కుటుంబానికి మద్దతుగా మాట్లాడాడు వర్మ. తాజాగా బాధిత కుటుంబం తరఫున న్యాయ పోరాటం చేస్తున్నాను అని ప్రకటించాడు. ఈ మేరకు ట్వీట్ చేశాడు వర్మ.
ఇక సమాజంలో చోటు చేసుకునే పలు సంఘటనలపై తనదైన రీతిలో స్పందిస్తాడు వర్మ. రాజకీయాలు, సినిమాలు, సమాజంలో చోటు చేసుకునే సంఘటనలపై కామెంట్స్ చేస్తుంటాడు. ఇక తాజాగా అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో 4 ఏళ్ల చిన్నారి ప్రదీప్ దారుణంగా గాయపడి.. మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ దారుణంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. జీహెచ్‌ఎంసీ అధికారులు, ప్రభుత అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ సంఘటన చోటు చేసుకుంది అంటూ ప్రజలు, విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. ఈ సంఘటనపై ఆర్జీవీ కూడా స్పందించాడు.
చిన్నారి ప్రదీప్ మృతికి సంతాపం తెలుపుతూ.. జీహెచ్‌ఎంసీ మేయర్, జంతుప్రేమికులపై ఓరేంజ్‌లో ఫైరయ్యాడు. ఈ సంఘటనపై జీహెచ్‌ఎంసీ మేయర్ స్పందిస్తూ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఆకలితో ఉండటం వల్లే కుక్కలు దాడి చేశాయి అని పేర్కొంది. ఈ వ్యాఖ్యల పట్ల వర్మ కాస్త ఘాటుగా స్పందించాడు. నగరంలోని మొత్తం 5 లక్షల కుక్కలను తీసుకెళ్లి ఒక డాగ్ హోం ఏర్పాటు చేయాలని వాటి మధ్యలో మేయర్ విజయలక్ష్మిని ఉంచాలని ట్వీట్ చేయడమే కాక దీన్ని కేటీఆర్‌కు ట్యాగ్ చేశాడు.
అంతేకాక ఈ సంఘటనపై ఓ టీవీ చానెల్ నిర్వహించిన డిబెట్‌లో మాట్లాడిన వర్మ.. జంతు ప్రేమికులపై సీరియస్ అయ్యాడు. ఈ ఘటనలో తల్లిదండ్రులదే తప్పు అన్న జంతు ప్రేమికులపై వర్మ మండి పడ్డాడు. తల్లిదండ్రులు కావాలని తీసుకెళ్లి కుక్కల దగ్గర పడేస్తారా? కొంచెం కూడా మానవత్వం లేకపోతే ఎలా అని మండిపడ్డారు. మానవత్వం ఉన్న వారు అయితేనే ఇక్కడ ఉండండి లేదా వెళ్లిపోండి అంటూ వారిపై ఓ రేంజ్‌లో సీరియస్ అయ్యారు.
ఇక తాజాగా బాధిత కుటుంబం తరఫున న్యాయ పోరాటానికి రెడీ అయ్యాడు వర్మ. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశాడు. ఈ మేరకు వర్మ ట్వీట్ చేశాడు. ‘‘ఈ విషయం తెలియజేస్తున్నందకు ఎంతో థ్రిల్‌గా ఫీలవుతున్నాను. వీధి కుక్కల దాడిలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగేలా పోరాడటం కోసం మిస్టర్ శ్రీనివాస్ కావేటి(, జ్యూరీస్ డాక్టరేట్, ఎల్‌ఎల్‌ఎం) అంతర్జాతీయ లాయర్ ఈ కేసును టేకప్ చేశారు’’ బాధిత కుటుంబంతో పాటు సదరు లాయర్ ఉన్న ఫోటోని షేర్ చేశాడు వర్మ. ప్రస్తుతం ఇది వైరలవుతోంది.
Mr.Srinivas Kaveti is going to sue GHMC,State of Telangana Police & Govt of India for omission of statutory duty, criminal negligence, vicarious liability and violation of constitutional right to life,under Article 21 of a 4 yr child constituting to STATE MURDER #JustifyPradeep pic.twitter.com/ngEXbMAxB7
— Ram Gopal Varma (@RGVzoomin) February 25, 2023
దీనిపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చాలా రోజుల తర్వాత వర్మ ఒక మంచి పని కోసం మాట్లాడుతున్నాడు.. ఇన్నాళ్లకు నచ్చాడు.. మిగతా సెలబ్రిటీలు ఎవరు ఈ సంఘటనపై కనీసం స్పందంచలేదు. కానీ వర్మ మాత్రమే ఘటన జరిగిన నాటి నుంచి బాధితుల తరఫున మాట్లాడుతున్నాడు.. ఇప్పుడు వారి తరఫున న్యాయ పోరాటం చేయడానికి రెడీ అయ్యాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఇన్నాళ్లకి నచ్చావ్ ఆర్జీవీ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఆర్జీవీ ప్రయత్నంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.