హైదరాబాద్ నగర నడిబొడ్డున 125 అడుగుల రవికిరణం, ఆశాకిరణం అయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మరి ఈ విగ్రహాన్ని తయారు చేసింది ఎవరో తెలుసా?
ఇవాళ మహనీయుడు అంబేద్కర్ జయంతి. ఆయన జయంతి సందర్భంగా హైదరాబాద్ నగర నడిబొడ్డున 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఈ మహోత్సవ వేడుకను కనులారా చూసేందుకు దేశం నలుమూలల నుంచి ఆయన అభిమానులు తరలి వచ్చారు. దేశమంతా తెలంగాణ వైపు చూసే రోజు ఈరోజు. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 2016 ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన పడింది. ఈ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 146.50 కోట్లను మంజూరు చేసింది. ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలో 11.7 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. విగ్రహం దిగువన గ్రంథాలయం ఉంటుంది. ఇందులో అంబేద్కర్ రాసిన రచనలు, ఆయన చరిత్రకు సంబంధించిన అంశాలు, చిత్రాలు ఉంటాయి.
భవనం లోపల ఆడియో విజువల్ ఒకటి ఉంటుంది. ఇందులో అంబేద్కర్ జీవిత విశేషాలను ప్రదర్శించడం జరుగుతుంది. ఈ విగ్రహం కోసం 791 టన్నుల స్టీలుని, 96 టన్నుల ఇత్తడిని ఉపయోగించారు. 425 మంది శ్రమించారు. మరి వీరికి దిశానిర్దేశం చేసింది ఎవరో తెలుసా? ఇవాళ దేశమంతా హైదరాబాద్ వైపు చూసేలా అంబేద్కర్ విగ్రహ తయారీలో ప్రధాన పాత్ర పోషించిన కళాకారులు ఎవరో తెలుసా? వారి వయసు ఎంతో తెలుసా? ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో రామ్ సుతార్ ఆర్ట్ క్రియేషన్స్ కి చెందిన ప్రముఖ శిల్పులు రామ్ వంజి సుతార్ (98), ఆయన కుమారుడు అనిల్ రామ్ సుతార్ (65) లు ఈ బృహత్కార్యంలో అగ్ర భాగం పొందారు.
భారతదేశంలోనే అతిపెద్ద విగ్రహం అయినటువంటి స్టాట్యూ ఆఫ్ యూనిటీ 597 అడుగుల సర్దార్ వల్లభభాయి పటేల్ విగ్రహం, ఛత్రపతి శివాజీ విగ్రహం, మహాత్మాగాంధీ వంటి మహనీయుల విగ్రహాలను తమ స్వహస్తాలతో చేసింది ఈ తండ్రీ కొడుకులే. 98 ఏళ్ల వయసులో కూడా అంత తీక్షణమైన శ్రద్ధతో అంత పెద్ద శిల్పాలను తయారు చేయడమంటే చాలా కష్టం. 65 ఏళ్ల వయసులో కూడా అంత ఓపిగ్గా చేయడం కష్టం. కానీ తండ్రీ, కొడుకులిద్దరూ వయసుని పక్కన పెట్టి చురుగ్గా, అవలీలగా మహనీయుల విగ్రహాలను తయారుచేస్తున్నారు. వీరు చేసిన విగ్రహాలు మన దేశంలోనే కాకుండా విదేశీ గడ్డ మీద అడుగుపెట్టి అక్కడ కూడా మన భారతీయుల తలెత్తుకునేలా చేశారు. తాజాగా 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని తయారు చేసి ఔరా అనిపించారు. వీరి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే కింది వీడియో చూడగలరు.