పేపర్ లీక్ కేసులో అరెస్టయిన బండి సంజయ్ బెయిల్‌పైన విడుదలయ్యారు. తన అత్త ఇటీవల చనిపోగా, దశ దిన కర్మలను తన చేతులతో నిర్వహించారు. అయితే బలగం సినిమాలో ఓ సీన్ ఆయన ఇంట్లో కూడా రిపీట్ అయ్యిందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలు అనాధిగా వస్తున్న సంస్కృతి, సంప్రాదాయాలు, ఆచార వ్యవహారాలను పాటిస్తూ వస్తున్నారు. పూర్వీకులు అనుసరిస్తున్న కొన్ని విధానాలను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. పిల్లలు పుడితే బారసాల దగ్గర నుండి చనిపోయినప్పుడు వారి పేరు మీద దశ దిన కర్మలు నిర్వహిస్తారు. అయితే మనిషి చనిపోతే.. మూడో రోజు చిన్న దినం, ఐదో రోజు, 11వ రోజు పెద్ద దినం అని నిర్వహిస్తుంటారు. ఆ రోజు చనిపోయిన వ్యక్తికి ఇష్టమైనవన్నీ వండి.. పిండం రూపంలో పిట్టలకు పెడతారు. కుటుంబ సభ్యులతో పాటు చనిపోయిన వ్యక్తులకు ఇష్టులైన వారు వచ్చి పెడితే.. వాటిని పక్షులు తింటే.. వారి ఆత్మ సంతృప్తి చెందుతుందని నమ్ముతారు. ముట్టకపోతే సరిగా పెట్టలేదని, ఎవరో రాలేదనో నమ్ముతారు. ఈ సన్నివేశం చుట్టూనే కథను తయారు చేసుకుని బలగం రూపంలో తెరకెక్కించారు దర్శకుడు వేణు. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలుసు.
అయితే ఇప్పుడు ఇదే సీన్ ఓ ప్రముఖుని ఇంట్లో రిపీట్ అయ్యింది. ఇంతకు ఎవ్వరునుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల నుండి నానుతున్న పేరు బండి సంజయ్. పదో తరగతి పరీక్షల పేపర్ లీకేజ్ కేసులో అరెస్టైన బీజెపీ ఎంపీ బెయిల్‌పై విడుదలయ్యారు. ఇటీవల సంజయ్ అత్తమ్మ చిట్ల విజయమ్మ చనిపోయిన విషయం తెలిసిందే. కరీంనగర్ జైలు నుంచి బెయిల్‌పై విడుదల అయిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. వెంటనే ఇంటికి చేరుకున్నారు. తన అత్త చిట్ల దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ సమయంలో ఆయన అరెస్టు కావడంతో పిట్ట ముద్ద పెడితే ముట్ట లేదట. తనను అమ్మ తర్వాత.. అత్మమ్మ కన్నకొడుకులా చూసుకుందని అన్నారు. తాను రాకపోవడంతో పిండం ముట్టలేదని చెప్పారు.
కుటుంబ సభ్యులు ఏడుస్తుంటే.. పక్షికి ముద్ద పెట్టడానికి వచ్చినా అంటూ వ్యాఖ్యానించారు. ఇంటి ముంగిట చనిపోయిన మా అత్తమ్మ ఫోటో ఉందని, ఆమె తింటుందని అన్నారు. ఆమె చనిపోతే అంతిమ సంస్కార కార్యక్రమాలు నిర్వహించాల్సిన బాధ్యత నామీద ఉందని తెలిసినా పోలీసులు కనికరం చూపలేదన్నారు. ‘ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎంపీ పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పరు.. నోటీసులివ్వరు. పోలీసుల తీరుతో పోలీసులు తలదించుకునే దుస్థితి. సెల్ ఫోన్‌తో మీకు ఏం అవసరం?’ అని పేర్కొన్నారు. బలగం సినిమా కూడా పిండం, పిట్ట చుట్టూ తీసిన కథే. ఆయన వ్యాఖ్యలతో సంజయ్ ఇంట్లో కూడా బలగం సినిమా సన్నివేశం రిపీటయ్యిందంటూ కామెంట్స్ వస్తున్నాయి.