కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకంతో చెలరేగిన అల్లర్లు, ఆందోళనలు పెచ్చుమీరుతున్నాయి. సిక్రిందాబాద్ ను తాకిన అగ్నిపథ్ ఆందోళనలు మరింత తీవ్రతరం అయ్యాయి. ఈ ఆందోళనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు యువకుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. వందల మంది ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసానికి దిగారు. మొదట రైల్వే స్టేషన్ బయట ఉన్న ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేసిన ఆర్మీ అభ్యర్థులు.. తర్వాత రైల్వే స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లారు. ఫ్లాట్‌ఫామ్ మీద ఉన్న రైళ్లపై రాళ్ల దాడి చేశారు.
అనంతరం అక్కడ ఉన్న రైళ్లు, స్టాళ్లను తగలబెట్టారు. దీంతో రైల్వే స్టేషన్ లోపల తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అన్ని రైళ్లను రద్దు చేశారు. ట్రాక్ పై బస్తాలు వేసి రైళ్లను ఆపడమే కాకుండా.. ఇష్టారీతిన విధ్వంసం సృష్టిస్తున్నారు. ఆందోళనకారులు చేసిన రాళ్లదాడిలో పలువురు ప్రయాణికులకు గాయాలు కూడా అయ్యాయి. కేంద్రం ఈ అగ్నిపథ్ పథకాన్ని వెంటనే బేషరతుగా రద్దు చేయాలని.. యథావిధిగా ఆర్మీ రిక్రూట్మెంట్ చేయాలని యువకులు డిమాండ్ చేస్తున్నారు? అగ్నిపథ్ పథకం, జరుగుతున్న ఆందోళనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.