భాగ్యనగరంలో ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాలెక్కాయి. గతేడాది మార్చి 22 నుంచి ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు నిలిచిపోయాయి. 15 నెలల సుదీర్ఘ విరామం తరువాత రైళ్లు పరుగులు తీస్తున్నాయి. గతేడాది కరోనాతో నిలిచిపోయిన రైళ్ల సేవలు తిరిగి ఇవాళ్టి నుంచి ప్రారంభించారు. గతంలో 121 సర్వీసులు తిరిగేవి. అయితే ఈరోజు నుంచి ప్రస్తుతం 10 సర్వీసులను రైల్వే అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య ఇరువైపులా మూడు చొప్పున మొత్తం 6, హైదరాబాద్- లింగంపల్లి మధ్య కూడా ఇరువైపులా రెండేసి చొప్పున మొత్తం 4 ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తాయి. ఉదయం 7.50 నుంచి రాత్రి 7.05 గంటల వరకు రైళ్లు తిరుగుతాయి. లైఫ్ లైన్ హైదరాబాద్ ఎంఎంటీఎస్ పేరుతో లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో రైలును పూలతో అలంకరించి ప్రారంభించారు. మిగిలిన సర్వీసులను దశల వారీగా ప్రారంభించనున్నారు.
హైదరాబాద్ ట్రాఫిక్ రద్దీ నియంత్రణలో ఎంఎంటీఎస్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. నిత్యం 121 సర్వీసులతో లక్ష 65 వేల మందిని గమ్య స్థానాలకు చేరుస్తుంది. 2003లో ప్రారంభమైన ఎంఎంటీఎస్ సర్వీసులు కొన్ని గంటలు తప్ప ఇంత సుదీర్ఘ కాలం ఆగిన దాఖలాలు లేవు. గత ఏడాది కరోనా కారణంగా ఆగిపోయిన ఎంఎంటీఎస్ సర్వీసులను తిరిగి ప్రారంభించింది రైల్వే బోర్డు.
అప్పడు సీజన్ టికెట్లు తీసుకున్నవారు జూన్23వ తేదీ నుంచి మిగిలిన రోజులు ఎన్ని ఉంటే అన్ని రోజుల వరకు పాత టికెట్లను వినియోగించుకోవచ్చని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. రైల్వే స్టేషన్లలోని టికెట్ కౌంటర్లలో గడువు పెంచుకోవచ్చని అన్నారు.