ఖమ్మంలో ఏర్పాటు చేయబోయే సినీయర్ ఎన్టీఆర్ విగ్రహంపై వివాదం నెలకొంది. శ్రీ కృష్ణుడు రూపంలో ఉన్న విగ్రహ ఏర్పాటుపై హిందూ, యాదవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
కరాటే కళ్యాణి.. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. అనేక పాత్రల్లో నటించారు. తనదైన నటనతో, మాటలతో నటనతో నవ్వులు పువ్వులు పూయించి.. ప్రేక్షకుల మదిలో మంచి గుర్తింపు పొందారు. ముఖ్యంగా రవితేజ హీరోగా నటించిన ‘కృష్ణ’ సినిమాలో ఆమె చేసిన పాత్ర..ఆమెను ఓ రేంజ్ లో ఫేమస్ చేసింది. ప్రస్తుతం సీరియల్స్ నటిస్తూనే, రాజకీయాల్లోను యాక్టీవ్ గా ఉంటున్నారు. అలానే తరచూ ఏదో ఒక వివాదంతో ఆమె వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆమెకు సంబంధించి మరో వార్త బయటకు వచ్చింది.
ఖమ్మంలో సినీయర్ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. ఆయన విగ్రహాన్ని శ్రీ కృష్ణుడి రూపంలో ఏర్పాటు చేయనున్నారు. అయితే ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై వివాదం నెలకొంది. శ్రీ కృష్ణుడు రూపంలో ఉన్న విగ్రహ ఏర్పాటుపై హిందూ, యాదవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తాము ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు వ్యతిరేకం కాదని.. అయితే కృష్ణుడి రూపంలో పెట్టడం సరికాదని అంటున్నారు. ఇది కేవలం రాజకీయ ప్రయోజనం కోసం ఏర్పాటు చేస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు.ఈక్రమంలోనే తాజాగా సినీనటి కరాటే కళ్యాణి ఆధ్వర్యంలో ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయం ముందు హిందూ, యాదవ సంఘాల సభ్యులు ఆందోళన నిర్వహించారు.
ఎన్టీఆర్‌కి విగ్రహం పెడితే అందరికీ సంతోషమేనని, కృష్ణుడు రూపంలో పెట్టడాన్ని మాత్రం తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రాబోయే తరాల పిల్లలు ఎన్టీఆర్‌ని శ్రీకృష్ణుడు అనుకునే పరిస్థితి వస్తుందని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును మంత్రి పువ్వాడ ఆపలని, లేకపోతే అడ్డుకుంటామని హెచ్చరించారు.ఇలా ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై వివాదం జరుగుతుంటే మరొకవైపు మే 28న ఎన్టీఆర్ శత జయంతిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఘనంగా వేడుకలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
అలానే ఖమ్మంలోనూ రాష్ట్ర రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ ఖ్యాతిని ప్రతిబింబించేలా 54 అడుగులు విగ్రహాన్ని.. ఖమ్మం పట్టణంలోని లకారం చెరువులో ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తానా సభ్యులు, కొందరు ఎన్నారైలు, పలువురు వ్యాపార వేత్తలు తమవంతు సాయం అందిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై నెలకొన్న వివాదం నేపథ్యంలో.. విగ్రహం ఏర్పాటు చేస్తారా? వెనక్కి తగ్గుతారా?లేదంటే ఆకారంలో మార్పుల చేస్తారా ? అనేది తెలియాల్సి ఉంది. మరి.. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు విషయంలో తాజాగా జరుగుతున్న ఈ వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.