తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్ లాంటి నాయకుడు దొరకడం మన అదృష్టమంటూ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. దేశంలోనే కేసీర్ గొప్పనాయకుడని, ఆయనకు ఒక విజన్ ఉందని ప్రకాశ్ రాజ్ కొనియాడారు. కొందరు మతతత్వ వాదులు రెచ్చగొట్టిన కేసీఆర్ పట్టించుకోలేదని, దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గాఉందని పేర్కొన్నారు. తాను చూసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని ప్రకాష్ రాజ్ చెప్పారు. శనివారం రాత్రి కరీంనగర్ లో నిర్వహించిన కళోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి..జానపద కళాకారులను, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని సన్మానించారు.
శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో కళోత్సవాలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ…” మంత్రి గంగుల కమలాకర్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన కళాకారులను ప్రోత్సహిస్తోన్న తీరు చూసి గౌరవం పెరిగింది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్. అలాంటి నాయకుడు దొరకడం మనందరి అదృష్టం. సీఎం కేసీఆర్ కి ఒక విజన్ ఉందని..దాని ప్రకారమే ఆయన ప్రణాళికలు అమలు చేస్తారు. కేసీర్ కృషితో తెలంగాణ.. దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది” అని అన్నారు.హరితహారం కార్యక్రమంలాగే భవిష్యత్తులో తెలంగాణ కళాకారుల ప్రతిభ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి స్వాభిమానం, మనల్ని మనం గౌరవించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. గతంలో తెలంగాణ భాష, యాసను సినిమాల్లో హాస్య నటులకే వాడేవారని, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ భాష అంటే ఏంటో అందరికి తెలిసిందని అన్నారు.