సమాజంలో పాతుకుపోయిన అతి ముఖ్యమైన అవలక్షణం లంచం. చావు బతుకుల్లో ఉన్న మనిషిని కాపాడాలన్నా లంచం ఇవ్వకపోతే.. అంతే సంగతులు అన్న పరిస్థితులు సమాజంలో ఉన్నాయి. అవినీతిని నిర్మూలించడం కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా.. దాడులు చేసినా ప్రభుత్వాధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ప్రజలను జలగల్లా పీడిస్తూ.. లంచం వసూలు చేస్తున్నారు.
కొందరు ప్రభుత్వ అధికారుల జీతం వేలల్లో ఉండగా.. వారి ఆస్తులు మాత్రం వందల కోట్ల రూపాయలుగా ఉంటున్నాయి. తాజాగా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు ఎలక్ట్రిసిటీ డీఈఓ. ఇక దర్యాప్తులో సదరు అధికారి వద్ద రూ. కోట్ల విలువైన భూముల కాగితాలు, తోటల వివరాలు, ఆస్తుల దస్తావేజులతో పాటుగా బంగారు, వెండి, డైమండ్ ఆభరణాలు లభ్యం కావడంతో అధికారులు షాక్ అయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా, మిర్యాలగూడలోని రెడ్డికాలనీ లైన్ మెన్ గా గుంటూరు శ్రీనివాస్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. కుమారుడి అనారోగ్యం కారణంగా 2004 నవంబరు 23 నుంచి సెలవుపై వెళ్లాడు శ్రీనివాస్. తిరిగి 2005 నవంబరు 14న పాలకవీడు లైన్మెన్గా విధుల్లో చేరాడు. అయితే,.. 350 రోజుల లీవ్ రెగ్యులరైజేషన్‌తో పాటు, ఇంక్రిమెంట్లు, లీవ్ పీరియడ్‌కి సంబంధించిన రూ.7 లక్షల ఎరియర్స్ ఇస్తూ పదోన్నతి కల్పించాలని శ్రీనివాస్ డీఈకి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు డీఈ మురళీధర్ రెడ్డి, యూడీసీ లతీఫ్, జేవో దామోదర్లు రూ.7 లక్షల లంచం డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: పాములు పగబడతాయా.. నిజమెంత?
ఈ విషయం గురించి శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. 2 లక్షలు లంచం తీసుకుంటుండగా డీఈ మురళీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఇక దర్యాప్తులో ఆయన వద్ద సుమారు 100 కోట్ల విలువైన అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు. మురళీధర్ రెడ్డి మిర్యాలగూడలో టెక్నికల్ ఏఈగా పనిచేయడంతో పాటుగా, హాలియాలో ఏఈగా, దేవరకొండ ఏడీఈగా, చౌటుప్పల్ డీఈగా పనిచేశారు. దేవరకొండకు చెందిన శివకుమార్ పేరిట బినామీ లైసెన్స్ తెరిచి ఆయన పనిచేసిన ప్రతిచోటా రూ. కోట్లలో పనులు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.