సూర్య కిరణాలు శరీరానికి బాణాల్లా గుచ్చుకుంటున్నాయి. దీనికి తోడు వడగాలులు, ఉక్కపోత ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఏదో చిన్న పనికి బయటకు వెళితే మన పరిస్థితి ఉందంటే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర విధులు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుళ్ల గురించి చెప్పనక్కర్లేదు.
ఎండలు మండుతున్నాయి. వానలు కురుస్తున్నాయి. కాస్త ఉపశమనంగా ఉంది అనుకునే లోపు మళ్లీ ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. పొద్దునే 8 గంటలకే సూర్యుడు నేరుగా ఇంట్లోకి చొరబడుతున్నాడు. మధ్యాహ్నం 12 దాటితే చాలు.. సూర్య కిరణాలు శరీరానికి బాణాల్లా గుచ్చుకుంటున్నాయి. దీనికి తోడు వడగాలులు, ఉక్కపోత ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఏదో చిన్న పనికి బయటకు వెళితే మన పరిస్థితి ఇలా ఉందంటే రోడ్డు మీద వ్యాపారం చేసుకుని బతికే చిరు వ్యాపారుల సంగతి చెప్పనక్కర్లేదు. అయితే బేరం లేకపోతే వారైనా కాస్త రెస్ట్ తీసుకునేందుకు నీడ పట్టుకు వెళతారు.. కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర విధులు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుళ్ల గురించి చెప్పనక్కర్లేదు.
కాస్త కూడా విరామం తీసుకోకుండా.. ఎండలో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్స్‌కు తెలంగాణ ప్రభుత్వం కూల్ న్యూస్ చెప్పింది. వడదెబ్బతో అనారోగ్య సమస్యల బారినపడుతున్న కానిస్టేబుల్ కోసం వినూత్న ఆలోచన చేసింది. ఎండ నుండి రక్షణ కల్పించేందుకు ఏసీ హెల్మెట్లు అందించాలని నిర్ణయం తీసుకుంది. దీని నిమిత్తం ఇప్పటికే ప్రయోగాత్మకంగా కొంత మందికి వీటిని అందించింది. ఈ హెల్మెట్ల పనితీరు, వారికి రక్షణగా ఉందా లేదా అని పరిశీలించి, వీరు ఇచ్చిన రివ్యూ ఆధారం చేసుకుని.. మిగిలిన ట్రాఫిక్ కానిస్టేబుల్స్‌కు ఇచ్చేందుకు సిద్ధమౌతోంది. రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్.. ఎల్బీనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో కొంత మంది ట్రాఫిక్ సిబ్బందికి ఏసీ హెల్మెట్లను అందించారు.
ఈ ఏసీ హెల్మెట్లను ప్రత్యేకంగా ట్రాఫిక్‌లో విధులు నిర్వర్తించే కానిస్టేబుళ్ల కోసమే తెలంగాణ పోలీస్ శాఖ ఇటీవల తయారుచేయించింది. బ్యాటరీ ఆధారంగా ఈ హెల్మెట్ పని చేయనుంది. అరగంట పాటు చార్జింగ్ చేస్తే చాలు మూడు గంటల పాటు వస్తుంది. ఈ హెల్మెట్ మూడు వైపుల నుండి గాలి వచ్చేలా రూపొందించారు. ముఖానికి, హెల్మెట్ లోపల.. ఇలా మూడు వైపుల నుంచి చల్లని గాలి వీస్తుంది. ఇవి ఎండల నుండి కాస్త ఉపశమనం కలిగించవచ్చునని అధికారులు భావిస్తున్నారు. వడదెబ్బ, ఎండ వేడి నుండి ఇది కాపాడుతుందని అంటున్నారు. ఇక మనకు రోడ్డుమీద ఏసీ హెల్మెట్స్ ధరించిన ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కనిపించనున్నారన్నమాట.