తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించాలని భావిస్తున్నారు నేటి యువత. దాని కోసం అక్రమ మార్గాలను ఎన్నుకుంటున్నారు. ఆన్ లైన్ బెట్టింగ్ లు కట్టి వారి జీవితాలతో పాటు కుటుంబాన్ని నవ్వుల పాలు చేస్తున్నారు. చివరకు వాటి నుండి బయట పడలేక తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. అటువంటి ఘటనే హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
ఇటీవల ఆన్‌లైన్‌లో జరుగుతున్నమోసాలకు అనేక మంది బలౌతున్నారు. రమ్మీ, రమ్ రమ్మీ, ఇతర క్రీడలకు సంబంధించిన పలు బెట్టింగ్ యాప్‌లు అనేకం పుట్టుకొస్తున్నాయి. అర చేతిలో ఇమిడిన సెల్ ఫోన్స్‌లో ఆకర్షణీయమైన ప్రకటనలతో యూజర్లను తమ వైపు చూపు తిప్పుకునేలా సదరు సంస్థలు జిమ్మిక్కులు చేస్తున్నాయి. రకరకాల ఆఫర్స్ ప్రకటిస్తూ యువతను ఈ బెట్టింగ్ యాప్‌లు ఆకర్షిస్తున్నాయి. పలు ఆఫర్లతో వల వేస్తున్నాయి. వీటికి ఆకర్షితులవుతున్న యువత.. ప్రపంచం మరిచి పోతున్నారు. అందులో బెట్టింగ్స్ కొడుతూ సమయాన్ని, జీవితాన్ని వృథా చేసుకుంటున్నారు. ఈ బెట్టింగ్ లకు బానిసలైపోతున్న యువత.. వీటి నుండి బయటపడలేక దొంగతనాలకు పాల్పడం, నేర ప్రవృత్తికి అలవాటు పడుతున్నారు. చివరకూ హత్యలకు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అటువంటి ఘటనే హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే మామిడిపల్లికి చెందిన చంద్రయ్య, శశికళ దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు రాజశేఖర్ (26) ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడూ ఆన్ లైన్ బెట్టింగ్ లకు అలవాడు పడ్డాడు. తీరిక దొరికినప్పుడల్లా సెల్ ఫోన్ లో తల మునకలు అయిపోయేవాడు. ఆన్ లైన్ యాప్ లైన క్రికెట్, ప్లేయింగ్ కార్డ్స్ లో బెట్టింగ్‌లు కట్టేవాడు. అలా ఇప్పటివరకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు పొగోట్టుకున్నాడు. డబ్బులు పోతున్నా.. వాటి నుండి బయట పడలేదు. చివరకూ అమ్మ నగలు కూడా ఆమెకు తెలియకుండా దొంగిలించి, వాటిని అమ్మేసి ఆ డబ్బులతో బెట్టింగ్ లు కట్టాడు. ఆ డబ్బులను కూడా పోగొట్టుకున్నాడు.
అయితే శివరాత్రి పండుగ సందర్భంగా తల్లి శశికళ బీరువాలో దాచిపెట్టిన బంగారం కోసం వెతికింది. ఇళ్లు మొత్తం వెతికినా ఎంతసేపటికి కనిపించకపోవడంతో ఇంట్లోని వారందరినీ ప్రశ్నించింది. తాము తీయలేదని కుటుంసభ్యులందరూ చెప్పారు. రాజశేఖర్ మీద అనుమానం వచ్చి ఆమె గట్టిగా అడగ్గా, తాను తీయలేదంటూ చెప్పి డ్యూటీకి వెళ్లిపోయాడు. అయితే మోసం చేశానన్న భావనతో ఒక్కసారిగా తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. ఆదివారం తెల్లవారుజుమన తాను చనిపోతున్నానంటూ తన సోదరుడికి రాజశేఖర్ మెసేజ్ పెట్టాడు. తాను చనిపోతున్నానని, తల్లిండ్రులను నువ్వే చేసుకోవాలని సందేశం పంపాడు. ఇంట్లోని బంగారం తానే తీసుకున్నానని, రూ.40 వేలకు అమ్మేసి బెట్టింగ్‌లు కట్టి నష్టపోయినట్లు తెలిపాడు.
ఆదివారం ఉదయం 5 గంటలకు పాలు తీసేందుకు పశువుల షెడ్డు దగ్గరకు తండ్రి వెళ్లగా.. అక్కడ ఉన్న ఓ వేపచెట్టుకు రాజశేఖర్ ఉరేసుకుని కనిపించాడు. రాజశేఖర్ మృతితో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. ఈ ఘటన పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు రాజశేఖర్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆన్ లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడి రాజశేఖర్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు. ఆన్ లైైన్ బెట్టింగ్ ల మూలంగా అనేక జీవితాలు ఛిన్నాభిన్నం అవుతున్నా నేటి యువత వాటిపై మక్కువ చూపడం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.